కరోనా విస్తరిస్తున్న వేళ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఆర్థిక బిల్లు ఆమోదం అనంతరం.. సభాకార్యకలాపాలు ముగిశాయి.
కీలకమైన ఆర్థిక బిల్లును ఎలాంటిచర్చ చేపట్టకుండానే మూజవాణి ఓటుతో ఆమోదించిన లోక్‌సభ అనంతరం నిరవధిక వాయిదాపడింది. కరోనా ప్రభావం పడిన రంగాలకు ఆర్థిక ప్యాకేజీని ఎప్పుడు ప్రకటిస్తారో చెప్పాలంటూ కాంగ్రెస్, ఇతర విపక్షాల ఆందోళన మధ్య కేంద్రం రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. ఆర్థిక బిల్లు ఆమోదం అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
బడ్జెట్ రెండో విడత సమావేశాలు ఏప్రిల్ 3 వరకు జరగాల్సి ఉండగా కరోనా వైరస్ నేపథ్యంలో సమావేశాలను కుదించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా కొంతమంది మాస్కులు ధరించి సభకు హాజరుకాగా టీఎంసీ, ఎన్సీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభకు గైర్హాజరయ్యారు.
మరోవైపు కరోనా వైరస్ నియంత్రణకు కృషిచేస్తున్న అత్యవసర సేవల సిబ్బంది, వైద్యులకు.. సభ వాయిదా పడిన అనంతరం ప్రధాని సహా లోక్‌సభ సభ్యులు చప్చట్లతో కృతజ్ఞతలు తెలిపారు.
ఎగువసభలోనూ ఆమోదం..
రాజ్యసభలో కూడా ఆర్థిక బిల్లు ఆమోదం పొందింది. జనతా కర్ఫ్యూ విజయవంతం చేసిన ప్రజలకు పెద్దలసభ కృతజ్ఞతలు తెలిపింది. వైద్యులు, నర్సులు, సాయుధ బలగాల సేవలను కొనియాడింది. పలు అంశాలపై చర్చ అనంతరం సభను నిరవధిక వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు.
ఇదీ చదవండి: కరోనాతో ఖైదీలకు పెరోల్.. సుప్రీం కీలక సూచనలు