ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దేశంలోనూ రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ ఉదారత చాటుకుంటున్నారు. కొందరు పేద వారికి ఆహారాన్ని అందిస్తుంటే... మరికొందరు ప్రాణాంతక వైరస్ను కట్టడి చేసేందుకు విరాళాలు ఇస్తున్నారు. కోల్కతా వాసి మహమ్మద్ ఇమ్రాన్ కూడా ఇలానే తన వంతు సాయం చేస్తున్నారు.
ఇమ్రాన్ కోల్కతా కొలిన్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆయనకు రెండంతస్థుల భవనం ఉంది. అందులో 15 కుటుంబాలు అద్దెకు నివసిస్తున్నాయి. వీరికి ఉదయం నిద్ర లేచి చూడగానే భవనం గేటుకు పోస్టర్లు కనిపించాయి. వీటిని చూడగానే అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
![Covid-19 lockdown turns landlord to a good samaritan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6592062_asp.jpg)
"ప్రియమైన అద్దెదారులారా. మార్చి నెలకు అద్దె చెల్లించనవసరం లేదు. ప్రస్తుతం పరిస్థితులు చాలా క్లిష్టమైనవి నాకు తెలుసు. మీరు ఆరోగ్యంగా, జాగ్రత్తగా ఉంటే చాలు" అని పోస్టర్లో రాసి ఉంది.
"ఇక్కడ ఉండే వారి గురించి నాకు వ్యక్తిగతంగా తెలుసు. లాక్డౌన్ కారణంగా ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమయ్యారు. ఉద్యోగానికి కూడా వెళ్లటం లేదు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి అండగా నిలవాలని నేను భావిస్తున్నాను. వీరిలో కొంతమంది అద్దెను చెల్లించటానికి ముందుకు వచ్చారు. కానీ నేను స్వీకరించలేదు. ఆ డబ్బులతో పేదలకు ఆహారాన్ని పంచి పెట్టాలని సూచించాను."
-ఇమ్రాన్, భవనం యజమాని.
లాక్డౌన్ ఏప్రిల్ నెలలోనూ కొనసాగితే ఆ నెలకు కూడా అద్దె చెల్లించనవసరం లేదని ఇప్పటికే వారికి తెలియజేశారు యజమాని.
"35 ఏళ్లుగా మేము ఇదే భవనంలో అద్దెకు ఉంటున్నాము. ఇమ్రాన్ తీసుకున్న నిర్ణయం మాకు ఎంతో ఊరటనిచ్చింది. నిజంగా మా యజమానికి దయా హృదయులు. ఆయనకు మా ఆర్థిక పరిస్థితి గురించి బాగా తెలుసు. ఇలాంటి సమయంలో ఒక నెల అద్దె మినహాయింపు ఇవ్వటం మాకు ఎంతో ఊరట ఇచ్చే అంశం."
-మహ్మద్ జావేద్, కిరాయిదారుడు
కర్ణాటకలోనూ...
కర్ణాటక గడగ్ జిల్లా భీష్‌మకేర్ ప్రాంతంలో ఉడాచమ్మ ఆలయం సమీపంలో నివసిస్తున్నారు పుష్ప పూజార్ అనే మహిళ. ఈమె ఇంట్లో మరో నాలుగు కుటుంబాలు నివసిస్తున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాపంగా లాక్డౌన్ విధించటం వల్ల అద్దెకు నివసించే వారు పనికి వెళ్లటం లేదు. వారి ఆర్థిక పరిస్థితిని గుర్తించిన ఆమె మార్చి, ఏప్రిల్ నెలలకు అద్దె చెల్లించవలసిన అవసరం లేదని చెప్పారు. ఈ నిర్ణయంపై అద్దెదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: పెద్దలూ.. కరోనా నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి!