దేశవ్యాప్తంగా కఠిన లాక్డౌన్ అమలవుతోంది. సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు గొంతు చించుకుంటున్నాయి. అయినా.. కేవలం ఒక్కరోజులోనే 227 కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్ ప్రభావిత ప్రాంతాల సంఖ్య పెరిగింది. అయితే, దీనికి కారణం మాత్రం ప్రజలేనంటోంది కేంద్ర ఆరోగ్య శాఖ.
వైరస్ లక్షణాలను సకాలంలో గుర్తించేందుకు ప్రజలు సహకరించనందువల్లే వైరస్ వ్యాప్తి పెరిగిందన్నారు ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్. ఒక్క కరోనా కేసు నమోదైనా.. ఆ ఒక్కరు ఎంత మందికి వైరస్ అంటించి ఉంటారో తెలియదు కనుక అది ప్రభుత్వానికి వైరస్ ప్రభావిత ప్రాంతమే అవుతుందని ఆయన స్పష్టం చేశారు.
"దేశంలో 1200కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ ప్రభావిత ప్రాంతాలు పెరిగాయి. ప్రభుత్వం సామాజిక దూర వ్యూహాలను అమలుచోస్తోంది. వైరస్ సోకిన వ్యక్తిని కలిసిన వారిని కనిపెట్టి దాని వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు."
-లవ్ అగర్వాల్, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి
వైద్యులకు కవచాలు..
కొందరు వైద్య సిబ్బందికి కరోనా సోకడంపై స్పందించారు అగర్వాల్. అందులో వారి నిర్లక్ష్యం ఏమీ లేదన్నారు. వైద్య నిపుణుల కోసం రక్షణ సామగ్రి మరింత అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.