మార్కెట్లో సర్జికల్ మాస్కులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారా? దొరికినా, ఆకాశాన్నంటుతున్న ధరలు చూసి తలలు పట్టుకుంటున్నారా? అయితే ఇకపై, ఆ మాస్కుల గురించి చింతించనక్కర్లేదు అంటోంది ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం. మూలనపడ్డ పాత కర్చీఫ్లు, టీషర్ట్లు వెలికితీస్తే చాలంటోంది. ఇంట్లో తయారు చేసుకునే ముసుగులే మిగతా మాస్కుల కంటే 70 శాతం ఎక్కువ సత్ఫలితాన్నిస్తాయంటూ ఓ కరదీపికను విడుదల చేసింది.
ఖాదీ మాస్కేస్కో...
మాస్కులు ధరించడం వల్ల కరోనా సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు గాల్లో కలిసే తుంపర్లు శరీరంలోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చు. జన సమూహాల్లో తిరిగే వ్యక్తులు కచ్చితంగా మాస్క్ ధరించాలని సూచిస్తోందీ కరదీపిక. అయితే, పలుచటి సర్జికల్ మాస్కులకంటే.. రెండు వరుసల ఖాదీ వస్త్రంతో తయారు చేసుకునే మాస్కులు 70 శాతం మెరుగ్గా పనిచేస్తాయని చెబుతోంది.
ఇలా వాడుకోవచ్చు..
మాస్కులు తయారు చేసుకునే ముందు, పాత వస్త్రాన్ని కనీసం 5 నిమిషాల పాటు ఉప్పువేసిన వేడినీళ్లలో మరిగించాలి. ముక్కు, నోరుకు అడ్డుగా కట్టుకునేలా వాటిని కత్తిరించి కుట్టుకోవాలి. ప్రతిరోజు ధరించిన మాస్కును సబ్బుతో ఉతికి, ఎండలో అతినీల లోహిత కిరణాల తాకేలా ఆరబెడితే ఎన్ని సార్లైనా వీటిని వాడుకోవచ్చు . కాబట్టి ప్రతి పౌరుడు, ఎన్జీఓలు ఇలా స్వగృహ మాస్కులను తయారు చేసుకోవాలని పిలుపునిచ్చింది.
ప్రస్తుతం దేశంలో 50 శాతం మంది మాత్రమే మాస్కులు ధరిస్తున్నారు. ఇలా అయితే మరో 50 శాతం మందికి వైరస్ సోకే ప్రమాదముంది. కనీసం 80 శాతం జనాభా మాస్కు ధరిస్తే కచ్చితంగా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం చెబుతోంది.