దేశవ్యాప్త లాక్‌డౌన్ పొడిగింపునకే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో మంగళవారం జరిగిన మంత్రుల బృందం (జీఓఎం) సమావేశం ఇదే నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. అన్ని విద్యాసంస్థల మూసివేతను మే 15 వరకు పొడిగించాలని ఈ బృందం సిఫార్సు చేసింది. కేసులు పెరుగుతున్న తరుణంలో లాక్‌డౌన్ ఎత్తేస్తే ఇప్పటివరకూ చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయని 90% రాష్ట్రాలు, కొందరు నిపుణులు పేర్కొన్న నేపథ్యంలో కేంద్రం కూడా అలాగే భావిస్తున్నట్లు తెలిసింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 12 లేదా 13వ తేదీన జాతినుద్దేశించి ప్రసంగిస్తారని తెలుస్తోంది. అప్పుడు ఈ విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రుల అభిప్రాయాలు ఇప్పటికే తెలుసుకున్న జీఓఎం... క్షేత్రస్థాయి పరిస్థితులపై కలెక్టర్లు, ఎస్పీలతో నేరుగా మాట్లాడింది. లాక్‌డౌన్ పొడిగించాలనే అందరూ ముక్తకంఠంతో చెప్పినట్లు తెలిసింది. మరికొన్నాళ్లు లాక్‌డౌన్ పొడిగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే కోరారు. ఎన్నిరోజులు పొడిగించాలో స్పష్టత రాకపోయినా.. లాక్‌డౌన్ కొనసాగించాలన్న నిర్ణయాన్ని మాత్రం కేంద్రం తీసుకున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. కరోనాపై దీర్ఘకాలిక పోరుకు సిద్ధంగా ఉండాలని, ఓడిపోయినట్లు భావించవద్దని ప్రధాని సోమవారమే చెప్పిన విషయం తెలిసిందే.
సేవా సైన్యానికి ధన్యవాదాలు తెలిపిన మంత్రులు
దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న వైద్య సిబ్బంది, భద్రతా సిబ్బంది, అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పనిచేస్తున్న లక్షల మందికి మంత్రుల బృందం ధన్యవాదాలు తెలిపింది. ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రధానమంత్రి పిలుపును అనుసరించి ఆహారం అందించాలని, ఇంట్లోనే మాస్కులు తయారు చేసుకోవాలని, ప్రతిచోటా సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చింది. నిత్యావసరాలు తగిన స్థాయిలో సరఫరా అవుతున్నట్లు సంతృప్తి వ్యక్తం చేసింది. ఎక్కువమంది ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్న ప్రార్థన స్థలాలు, షాపింగ్ మాల్స్ వంటి వాటిపై తీవ్రంగా దృష్టి సారించాలని పేర్కొంది.
లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం ఎలా ఉన్నా వీటిపై మాత్రం ఓ కన్ను వేయాలని తెలిపింది. ముందుజాగ్రత్త చర్యగా ప్రార్థన మందిరాల్ని మే 15 వరకు మూసివేయడమే మేలని మంత్రుల బృందం సిఫార్సు చేసింది. డ్రోన్ల ద్వారా నిఘాను మరింత విస్తృతం చేయాలని, వైద్య పరీక్షల సౌకర్యాలను పెంచాలని అభిప్రాయపడింది. లాక్‌డౌన్‌ను ఒకవేళ 14వ తేదీనే ముగిస్తే పర్యవసనాలు ఎలా ఉంటాయనే అంశంపైనా క్లుప్తంగా చర్చించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి అమిత్‌షా, సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి సహా దాదాపు 15 మంది మంత్రులు పాల్గొన్నారు. తీసుకున్న నిర్ణయాలు, వ్యక్తమైన అభిప్రాయాలను రాజ్‌నాథ్‌సింగ్ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు- లాక్‌డౌన్ పొడిగింపుపై ఇంకా నిర్ణయమేమీ తీసుకోలేదని, ఊహాగానాలు చేయవద్దని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు.
ఇదీ చూడండి:ఎంపీల వేతనాల్లో కోతకు ఆర్డినెన్స్