కర్ణాటక ఉడుపి జిల్లాలో దారుణం జరిగింది. కరోనా వైరస్ సోకిందన్న భయంతో 56 ఏళ్ల వృద్ధుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అతడికి ఎటువంటి వైరస్ లక్షణాలు లేవని అధికారులు వెల్లడించారు.
అనుమానమే పెనుభూతం...
56 ఏళ్ల గోపాలకృష్ణ ఉడుపి జిల్లా ఉప్పూర్ గ్రామంలో నివసించేవాడు. కేఎస్ఆర్టీసీలో బస్సు డ్రైవర్. ఇటీవల అతడికి కొత్త డ్రైవర్లకు శిక్షకుడిగా పోస్టింగ్ ఇచ్చారు అధికారులు.
తనకూ కరోనా సోకిందని గోపాలకృష్ణకు అనుమానం వచ్చింది. అదే విషయాన్ని ఆయన కొందరు స్థానికులకూ చెప్పాడు. గత రాత్రి 2 గంటల వరకు మెలకువగానే ఉండి, కుటుంబసభ్యులతో మాట్లాడాడు. ఉదయం 5 గంటలకు ఇంట్లోని వారు లేచి చూసేసరికి చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించాడు.
కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గోపాలకృష్ణ రాసిన లేఖ ఇంట్లో కనిపించింది. కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని ఆ లేఖలో సూచించాడు.
ఇదీ చూడండి:దేశంలో మరింత పెరిగిన కరోనా మృతుల సంఖ్య