దిల్లీ జైళ్లలోని ఖైదీలు కొవిడ్ బారినపడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఖైదీలందరికీ తరచూ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం సహా.. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం, హోమియోపతి మందులు ఇస్తున్నామని చెప్పారు.
70 మంది జైలర్లకు ప్రత్యేక శిక్షణ..
హోమియోపతి మందుల కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జైలు విభాగం తెలిపింది. అందులో భాగంగా రెండు నెలలకోసారి మందులు ఇస్తున్నామని స్పష్టం చేసింది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే నిమ్మరసం, విటమిన్-సి కలిగిన పండ్ల రసాలు అందిస్తున్నామని తెలిపింది. ఖైదీల యోగక్షేమాలను చూసుకునేందుకు.. 70 మంది సిబ్బందికి సైకాలజిస్టులతో ప్రత్యేక శిక్షణ ఇప్పించామని పేర్కొంది జైలు శాఖ.
భౌతిక దూరం పాటించేలా..
ఖైదీలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ.. అవసరమైన చర్యలు చేపడుతున్నామని జైలు అధికారులు వెల్లడించారు. ఖైదీలను మూడు సమూహాలుగా విభజించి తప్పనిసరిగా భౌతిక దూరం పాటించేలా జాగ్రత్త వహిస్తున్నామన్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న కారణంగా సుమారు 4 వేలమంది ఖైదీలను విడుదల చేశారు. వారిలో 1,100 మంది అత్యవసర బెయిల్పై, మిగిలినవారు మధ్యంతర బెయిల్ మీద విడుదలయ్యారు. మరో 14,600మంది ఖైదీలు జైళ్లలోనే ఉన్నారు.
దిల్లీలోని తిహార్, రోహిణి, మండోలి జైళ్లలో ఇప్పటివరకు మొత్తం 63 మంది ఖైదీలకు కరోనా సోకింది. వారిలో 61 మంది వైరస్ను జయించగా.. ఇద్దరు మృతి చెందారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్లో మళ్లీ అంతర్యుద్ధం- కారణం ఆ 'లేఖ'!