కరోనా సంక్షోభం కారణంగా విద్యా వ్యవస్థలో ఊహించని మార్పులు వచ్చాయి. పాఠశాల తరగతి గదులు ఆన్లైన్లోకి మారిపోయాయి. స్మార్ట్ఫోన్లు, సాంకేతికతను ఉపయోగించుకుని విద్యార్థులకు ఇళ్లలోనే పాఠాలు బోధిస్తున్నారు. ఈ విధానం వల్ల నగరాల్లోని విద్యార్థుల పరిస్థితి కాస్త ఫర్వాలేదు కానీ గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు సమస్యలు ఎదురవుతున్నాయి. స్మార్ట్ఫోన్లు కొనే స్తోమత లేక, ఇంటర్నెట్ సదుపాయం లేక ఆన్లైన్ తరగతులకు హాజరుకాలేని దుస్థితి నెలకొంది.
ఇలాంటి విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక బీదర్ జిల్లాలోని పాఠశాలలు ప్రత్యామ్నాయ మార్గాన్ని గుర్తించాయి. తరగతులను విద్యార్థుల ఇళ్ల మధ్యలోనే నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలల్లోని గ్రంథాలయాలు, స్థానికంగా ఉండే ఆలయాలు, పెద్ద ఇళ్లు, ఇతర అనువైన ప్రదేశాలను ఎంచుకున్నాయి. విద్యార్థులంతా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ పాఠాలు వింటున్నారు.
ఈ పద్ధతి చాలా బాగుందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
" ఆన్లైన్ తరగతులకు హాజరైనప్పుడు నిబంధనలు తెలియక కొంత మంది విద్యార్థులు గట్టిగా అరిచే వాళ్లు. దాని వల్ల క్లాస్ మొత్తానికి ఆటంకం ఏర్పడేది. ఏమైనా సందేహాలు ఉన్నా నివృతి చేసుకునేందుకు వీలుండేది కాదు. కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను నేరుగా అడుగుతున్నాం."
-శ్రద్ధ తనాజీ, విద్యార్థిని.
అన్ని జాగ్రత్తలు తీసుకునే పాఠాలు బోధిస్తున్నట్టు చెబుతున్నారు ఉపాధ్యాయులు.
" గత మూడు నెలలుగా తరగతులను ఈ పద్ధతిలో నిర్వహిస్తున్నాం. మొదట్లో విద్యార్థులను పంపేందుకు తల్లిదండ్రులు విముఖత వ్యక్తం చేసేవారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తామని వారికి హామీ ఇచ్చాక సానుకూలత వ్యక్తం చేసి పిల్లలను తరగతులకు పంపిస్తున్నారు."
-ఉపాధ్యాయుడు.
ఈ విధానం బాగానే ఉన్నప్పటికీ వర్షాకాలంలో బహిరంగ ప్రదేశాల్లో తరగతులు నిర్వహించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఓ ఉపాధ్యాయుడు చెప్పారు.