దేశవ్యాప్తంగా కార్గిల్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 1999 మే 3న మొదలైన కార్గిల్ యుద్ధం జులై 26న అంటే 1999లో ఇవాల్టి రోజునే ముగిసింది. నాటి యుద్ధానికి ఇవాళ్టితో 20 ఏళ్లు పూర్తయ్యాయి. కార్గిల్‌లో పాక్ సైన్యం అక్రమ చొరబాటును భారత సైన్యం పరాక్రమంతో తిప్పికొట్టింది. నాటి పోరాటంలో పలువురు అమరులయ్యారు.
వారి త్యాగాలను దేశప్రజలంతా స్మరించుకుంటూ... కార్గిల్ వీరులకు నివాళులర్పిస్తున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శ్రీనగర్‌లోని బాదామి భాగ్ కంటోన్మెంట్లో అమరవీరులకు నివాళులర్పించారు. దేశ రాజధాని దిల్లీలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు.
ద్రాస్‌లో ఘనంగా వేడుకలు
జమ్ముకశ్మీర్ ద్రాస్ సెక్టార్‌లోని యుద్ధ స్మారకం వద్ద సైన్యం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరుగుతోంది. త్రివిధ దళాల ఆధ్వర్యంలో అమర జవాన్లకు సైనిక వందనం చేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొనాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం కారణంగా పర్యటన రద్దయింది.
అమరులను గుర్తుచేసుకుంటున్న కుటుంబసభ్యులు
నాటి కార్గిల్ సమరంలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబ సభ్యులు యుద్ధ స్మారకం వద్దకు చేరుకుని నివాళులర్పిస్తున్నారు.
విక్రమ్ బాత్రాకు పరమవీర చక్ర
కార్గిల్ యుద్ధంలో అమరుడైన కెప్టెన్ విక్రమ్ బాత్రాకు భారత ప్రభుత్వం పరమవీర చక్ర ప్రకటించింది. దేశ రాజధాని దిల్లీ రహదారులకు పరమ వీరచక్ర గ్రహీతల పేర్లు పెట్టాలని విక్రమ్ బాత్రా తండ్రి అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: ఆపరేషన్ విజయ్: కార్గిల్ పరాక్రమానికి 20 ఏళ్లు