కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం వల్ల దాదాపు దేశం మొత్తం స్తంభించిపోయింది. మెజార్టీ రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తమ విద్యార్థులకు పలు సూచనలు చేసింది గుజరాత్ గాంధీనగర్ ఐఐటీ. కరోనా సెలవులను వృథా చేసుకోకుండా 'గ్రేట్ ప్లేగ్ ఆఫ్ లండన్' సమయంలో ట్రినిటీ కళాశాల నుంచి ఇంటికి పంపించినప్పుడు న్యూటన్ చేసిన విధంగా నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించింది.
'ప్రాజెక్టు ఐజాక్' ప్రారంభం
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తరగతులు, ఇతర అన్ని కార్యకలాపాలను ఐఐటీలో ఈనెల 31వ తేదీ వరకు నిలిపివేశారు. దీని వల్ల ఇళ్లకు పరిమితమైన విద్యార్థుల కోసం 'ప్రాజెక్టు ఐజాక్'ను ప్రారంభించింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)గాంధీనగర్.
"ఈ ప్రాజెక్టు రూపకల్పనకు 'ఐజాక్ న్యూటన్' స్ఫూర్తి. 1665లో 350 ఏళ్ల క్రితం గ్రేట్ ప్లేగ్ ఆఫ్ లండన్ సమయంలో న్యూటన్ను కేంబ్రిడ్జ్ ట్రినిటీ కళాశాల ఇంటికి పంపించేసింది. ప్లేగు వ్యాధి విపత్తు సమయంలోనే అప్పటికి 22 ఏళ్ల విద్యార్థి అయిన న్యూటన్ ఆ ఏడాది కాలిక్యులస్, ఆప్టిక్స్, గురుత్వాకర్షణ సిద్ధాంతాలతో సహా పలు ఆవిష్కరణలను అభివృద్ధి చేశారు. విద్యార్థులు, అధ్యాపకులు.. న్యూటన్ను ఆదర్శంగా తీసుకొని ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆవిష్కరణలు చేయాలి."
- సుధీర్ జైన్, డైరెక్టర్- ఐఐటీ గాంధీనగర్
సెలవుల సమయాన్ని రచనలు, పెయింటింగ్, సంగీతం, కోడింగ్ వంటి అంశాల్లో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు వినియోగించుకోవాలని సూచించారు ఐఐటీ డైరెక్టర్ సుధీర్. విశ్వవిద్యాలయం తిరిగి తెరిచాక ఈ సమయంలో విద్యార్థుల ఉత్తమ, అత్యంత సృజనాత్మక ఉత్పత్తులను ప్రదర్శించే వేడుక చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కరోనా కలవరం: ప్రపంచవ్యాప్తంగా 15వేలు దాటిన మరణాలు