కరోనా మహమ్మారిపై పోరుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ (ప్రధానమంత్రి సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ ఫండ్)కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, రాజకీయ, సినీ, పారిశ్రామిక వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
పవర్ గ్రిడ్ రూ.200 కోట్లు
కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా పీఎం కేర్స్ నిధికి రూ.200 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిధులను రెండు విడతలుగా అందించనున్నట్లు స్పష్టం చేసింది. మొదట రూ.130 కోట్లు పీఎం కేర్స్‌కు అందించి.. వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21లో రూ.70 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. సంస్థ ఉద్యోగులు కూడా తమ జీతాల్లోనుంచి విరాళం అందించేందుకు సుముఖంగా ఉన్నట్లు పేర్కొంది.
ఎల్ఐసీ..రూ.105 కోట్లు
కరోనా నియంత్రణకు పీఎం కేర్స్ నిధికి రూ.105 కోట్లు విరాళంగా ప్రకటించింది భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ). ఇందులో రూ.5 కోట్లు గోల్డెన్ జూబ్లీ ఫండ్ నుంచి అందిస్తామని తెలిపింది.
ఇండియాబుల్స్..
కరోనాపై పోరుకు పీఎం కేర్స్ నిధికి 'ద ఇండియా బుల్స్ గ్రూప్' రూ.21 కోట్లు విరాళంగా ప్రకటించింది. వైరస్‌ను అరికట్టే చర్యల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమవంతు సహకారం అందిస్తామని పేర్కొంది.
లక్ష్మీ మిత్తల్ రూ.100 కోట్లు.
పీఎం కేర్స్ నిధికి ఎన్ఆర్ఐ బిలియనీర్ లక్ష్మీ ఎన్ మిత్తల్ రూ.100 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. భారత్‌లోని ఆయన భాగస్వామ్య సంస్థల ద్వారా ఈ విరాళం అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రోజుకు 5వేల మందికి ఆహారం, 30వేల మందికి నిత్యావసరాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.
మోదీ తల్లి.. రూ.25 వేలు
కరోనాపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ తన సాయాన్ని అందించారు. ఆమె దాచుకున్న సొమ్ములోంచి రూ.25,000ల మొత్తాన్ని పీఎం కేర్స్ నిధికి అందించారు.
ఈడీ ఉద్యోగులు..
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌లోని ఉద్యోగులు తమ ఒక్కరోజు వేతనాన్ని పీఎం కేర్స్ నిధికి ఇచ్చేందుకు ముందుకువచ్చారు.
ఇదీ చూడండి: దేశంలో 1400కు చేరువలో కరోనా కేసులు.. 35 మంది మృతి