చైనాలో కరోనా వైరస్ అంతకంతకూ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ప్రత్యేకించి వుహాన్ నుంచి వస్తున్న ప్రయాణికులకు... ఆయా దేశాలు ముమ్మర వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి. దీంతోపాటు చైనాలోని తమ దేశీయులను తిరిగి రప్పించేందుకు భారత్ సహా పలు దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం స్పందించింది. ఏ దేశాలైనా తమ పౌరులను తిరిగి రప్పించడానికి పట్టుబట్టితే సాయం చేస్తామని ప్రకటించింది. వారిని ఖాళీ చేయించడానికి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని పేర్కొంది.
భారతదేశంతో పాటు అమెరికా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా దేశాలు తమ పౌరులను హుబెయి రాష్ట్రంలోని వుహాన్ నగరం నుంచి ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తున్నాయి. హుబెయిలో ఉంటున్న 250 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. వీరిలో చాలా వరకు విద్యార్థులు, వృత్తి నిపుణులు ఉన్నారు.
ఈ నేపథ్యంలో పౌరులను తమ స్వస్థలాలకు చేరవేయడానికి చైనా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు.
"హుబెయి ప్రావిన్స్‌లోని వుహాన్ పట్టణంలో ఉన్న అన్ని దేశాల పౌరుల ఆరోగ్య సంరక్షణకు ఇచ్చే ప్రాధాన్యంపై చైనా కట్టుబడి ఉంది. వారి చట్టబద్ధమైన ఆందోళనలు, డిమాండ్లను సకాలంలో పరిష్కరించడానికి సమర్థవంతమైన చర్యలను చైనా కొనసాగిస్తుంది. వుహాన్‌లోని తమ పౌరులను ఖాళీ చేయమని దేశాలు పట్టుబడితే చైనా తగిన ఏర్పాట్లు చేస్తుంది."
-చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ
భారత పౌరులను తరలించే ప్రయత్నాలను సమన్వయం చేస్తున్న బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం వుహాన్, హుబే ప్రావిన్స్‌లోని భారతీయుల కోసం బుధవారం.. రిజిస్ట్రేషన్, అంగీకార పత్రాలను పంపిణీ చేసింది. తద్వారా స్వదేశానికి తరలించాలనుకునే భారతీయుల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. వారికోసం ఎయిర్ఇండియా 747 బోయింగ్ విమానాన్నీ సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది.
భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత వారు 14 రోజుల పాటు సూచించిన నగరంలో నిర్బంధంలో గడపాలని అక్కడి దౌత్య కార్యాలయం స్పష్టం చేసింది. 14 రోజుల్లో వైరస్ లక్షణాలు బయటపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే 14 రోజులపాటు నిర్దేశించిన నగరంలో నిర్బంధంలో ఉండాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
విమానాలు బంద్
కరోనా ధాటికి చైనాకు వెళ్లే విమానాలనూ రద్దు చేస్తున్నట్లు పలు విమానయాన సంస్థలు ప్రకటించాయి. మరికొన్ని ఎయిర్లైన్లు విమాన సిబ్బందికి పలు సూచనలు చేశాయి.
ఫిబ్రవరి 1 నుంచి బెంగళూరు-హాంకాంగ్ మధ్య నడిచే విమానాలను రద్దు చేస్తున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. దిల్లీ-చెంగ్డూ మధ్య నడిచే విమానాలను ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. కోల్‌కతా-గ్వాంఝౌ మార్గంలో ప్రయాణించే విమానాలను ప్రస్తుతానికి కొనసాగిస్తున్నట్లు తెలిపింది. రోజూవారీగా పరిస్థితిని సమీక్షించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
"చైనాలో ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితిని జాగ్రత్తగా అంచనా వేసిన తరువాత ఇండిగో తన వినియోగదారులు, సిబ్బంది కోసం కొన్ని భద్రతా చర్యలు తీసుకుంటోంది. చైనా ప్రయాణ ఆంక్షల కారణంగా దిల్లీ-చెంగ్డూ మధ్య ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 20 వరకు మా విమానాలను నిలిపివేస్తున్నాం. ఫిబ్రవరి 1 నుంచి బెంగళూరు-హాంకాంగ్ విమానాలను కూడా నిలిపివేస్తున్నాం. ఈ చర్యలు ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తాయని అర్థం చేసుకుంటున్నాం. దీని ప్రభావానికి గురయ్యే ప్రయాణికులకు పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తాం."-ఇండిగో
విమాన సిబ్బందికి పలు సూచనలు చేసింది ఇండిగో. చైనానుంచి తిరిగి వచ్చే క్రమంలో సిబ్బందిని అక్కడ దించకుండా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. థాయిలాండ్, సింగపూర్‌లకు వెళ్లే విమానాల్లో ప్రయాణిస్తున్న సిబ్బంది ఆయా దేశాల్లో దిగిన వెంటనే ఎన్95 మాస్కులను ధరించాలని సూచించింది.
ఎయిరిండియా..
మరోవైపు ఎయిరిండియా సైతం ఇదేబాటలో పయనిస్తోంది. దిల్లీ-షాంఘై మధ్య రాకపోకలు సాగించే విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 మధ్య వీటిని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. భారత్ నుంచి ఆగ్నేయాసియాకు వెళ్లే విమాన సిబ్బంది ఎన్95 మాస్కులు ధరించాలని ఎయిరిండియా సూచనలు జారీ చేసింది.