కరోనా వైరస్ సోకినట్టు నిర్ధరణ అయిన ఇటలీ పర్యటకులను గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. భారత పర్యటనలో ఉన్న 21 మంది ఇటాలియన్లు, ముగ్గురు భారతీయుల బృందంలోని 14 మందికి వైరస్ సోకింది. ప్రస్తుతం వారిని దిల్లీలోని ఐటీబీపీ కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ప్రభుత్వ ప్రత్యేక అభ్యర్థన మేరకు వారిని తమ ఆస్పత్రిలో చేర్చుకొని చికిత్స అందిస్తున్నట్లు దిల్లీలోని మెడాంటా వైద్యశాల యాజమాన్యం తెలిపింది. ఇటలీ పర్యటకుల కోసం ప్రత్యేకంగా క్వారంటైన్ ఫ్లోర్ ఏర్పాటు చేశామని.. వారిని అందులోని ఒక వార్డులో ఉంచి చికిత్స అందిస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైరస్ సోకిన 14మందిని మెడాంటా వైద్యశాలకు తరలించారు.
మరో బృందానికి అనుమతి..
మధ్యప్రదేశ్‌లోని ప్రపంచ వారసత్వ సంపద ఖజురహోను చూసేందుకు వచ్చిన మరో 9 మంది ఇటలీ దేశస్థులు, వారితో ఉన్న భారతీయ గైడ్‌ను గత మంగళవారం ప్రత్యేక శిబిరానికి తరలించారు వైద్యాధికారులు. అయితే తమ సొంత పూచీపై స్వదేశానికి వెళ్లేందుకు అనుమతించాలని ఇటలీ పర్యటకులు కోరారు. దీంతో వారిని దిల్లీ వెళ్లేందుకు అనుమతించారు అధికారులు. వారి రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించినట్లు తెలిపారు.
రాపిడ్ యాక్షన్ ఫోర్స్..
దేశవ్యాప్తంగా 29 కరోనా కేసులు నమోదైన సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా, తాలూకా, గ్రామ స్థాయిల్లో రాపిడ్ యాక్షన్ బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ప్రజలు సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించింది.
పేటీఎం ఉద్యోగిని కలిసిన వారిని..
దిల్లీ గురుగ్రామ్‌లోని పేటీఎం సంస్థలో పని చేస్తున్న ఉద్యోగికి కరోనా వైరస్ నిర్ధరణ అయిన క్రమంలో ఆయనను కలిసిన ఐదుగురిని ప్రత్యేక శిబిరానికి తరలించారు దిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు. వారి నమూనాలను పరీక్షలకు పంపించారు. ఫలితాలు వచ్చే వరకు వారిని ప్రత్యేకంగా ఉంచనున్నట్లు తెలిపారు. అతనిని సుమారు 91 మంది కలిసినట్లు అధికారులు గుర్తించగా.. వారందరికీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇరాన్‌లోని భారతీయుల కోసం..
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. భారత వైద్యుల బృందం ఈ రోజు ఇరాన్‌కు చేరుకుంటుందని వెల్లడించారు. ఈ సాయంత్రం నాటికి కోమ్‌లో తొలి క్లినిక్‌ను ఏర్పాటు చేస్తామని ఆశిస్తున్నట్లు తెలిపారు. వారికి స్క్రీనింగ్ నిర్వహించి తీసుకొచ్చేందుకు సంబంధిత ఇరాన్ అధికారులతో చర్చలు చేపట్టినట్లు ఆయన ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: నిర్భయ దోషులకు డెత్ వారెంట్- మార్చి 20న ఉరి అమలు