కరోనా వైరస్‌పై పోరుకు భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ 'డీఆర్డీఓ' చర్యలు ముమ్మరం చేసింది. ఆసుపత్రులు, కార్యాలయాలు తదితర ప్రాంతాల్లో.. శానిటైజైషన్ నిర్వహణకు సాంకేతిక పరికరాలను తయారు చేసింది.
దిల్లీ సెంటర్‌ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్, ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (సీఎఫ్ఈఈఎస్).. రెండు పద్ధతులను రూపొందించింది.
బ్యాక్ ప్యాక్ ఏరియా శానిటైజేషన్..
రెండు సాంకేతికతల్లో ఒకటి బ్యాక్ ప్యాక్ ఏరియా శానిటైజేషన్ ఎక్విప్మెంట్. వైరస్ అనుమానిత ప్రాంతాలను(ఇళ్లు, చిన్న చిన్న ప్రాంతాల వంటివి) శానిటైజ్ చేసేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఒక శాతం హైడ్రోక్లోరైడ్‌తో కూడిన ద్రవాన్ని శానిటైజేషన్ కోసం వినియోగిస్తారు.
ఈ వ్యవస్థను శానిటైజ్ చేసే వ్యక్తి సులభంగా ఉపయోగించేందుకు వీలుంది. దీని ద్వారా దాదాపు 300 చదరపు మీటర్ల స్థలాన్ని శానిటైజ్ చేయొచ్చని డీఆర్డీఓ తెలిపింది. ఆస్పత్రుల్లోని రిసెప్షన్లు, డాక్టర్ ఛాంబర్లు, కార్యాలయాల లోపల శానిటైజ్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ట్రాలీ మౌంటెడ్ శానిటైజేషన్..
రెండోది ట్రాలీ మౌంటెడ్ శానిటైజేషన్ వ్యవస్థ. దీని ద్వారా 3,000 చదరపు మీటర్ల ప్రాంతాన్ని శానిటైజ్ చేసేందుకు వీలుంటుంది. 50 లీటర్ల సామర్థ్యమున్న ట్యాంక్‌తో ఈ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది డీఆర్డీఓ. దీని ద్వారా 12 నుంచి 15 మీటర్ల దూరం వరకు శానిటైజేషన్ ద్రవాన్ని పిచికారి చేయొచ్చు. ఆస్పత్రులు, మాల్స్, విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, ఐసోలేషన్, క్వారంటైన్ సెంటర్లు సహా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అనుమానం ఉన్న ప్రాంతాల్లో శానిటైజేషన్‌కు ఇది ఉపయోగపడనుంది.
ఈ వ్యవస్థలు తక్షణమే దిల్లీ పోలీసులకు సమకూర్చారు. ఇతర ప్రాంతాల్లోను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు డీఆర్డీఓ తెలిపింది.
పోరుకు ఆర్మీ సిద్ధం
కరోనా సోకిన వారికి వైద్యం అందించేందుకు భారత ఆర్మీ సిద్ధమవుతోంది. ఇందుకోసం 51 ఆస్పత్రులను సిద్ధం చేసినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
కొవిడ్ 19 నిర్ధరణ పరీక్షలు చేయగల సామర్థ్యమున్న ఐదు ల్యాబ్‌లను సిద్ధం చేసినట్లు పేర్కొంది.
ఇందులో దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి(రీసెర్చ్ అండ్ రిఫరల్), బెంగళూరులోని ఎయిర్‌ఫోర్స్ కమాండెడ్ ఆస్పత్రి, పుణెలోని ఆర్మీ వైద్య కళాశాల, లఖ్‌నవూ, ఉందాపూర్లలోని కామాండెడ్ ఆస్పత్రులు ఉన్నాయి.
మరో ఆరు ఆస్పత్రులను కరోనా పరిక్షలకు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.