దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల సెలవుల నిబంధనల్లో సడలింపు చేసింది. 50 ఏళ్ల వయసుపైబడిన వారు ఇకపై ఎలాంటి వైద్య ధ్రువపత్రం (మెడికల్ సర్టిఫికెట్) లేకుండానే సెలవు తీసుకునే వెసులుబాటు కల్పించింది.
కరోనా వైరస్ నేపథ్యంలో వైద్య విభాగంపై అదనపు భారాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
" 50 ఏళ్ల వయసు పైబడి, డయాబెటిస్, శ్వాసకోశ, మూత్రపిండాల వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్ లేకుండానే సెలవులు మంజూరు చేయాలని నిర్ణయించాం. ఈ ఆదేశాలు 2020, ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. ఈ నిర్ణయంతో వైద్య విభాగంపై అనసర భారాన్ని నివారించగలుగుతాం."
- సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ .
ఎవరైన ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లేందుకు నిర్ణయించుకుంటే.. వారికి సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వ విభాగాలను కోరింది మంత్రిత్వ శాఖ.
ఇదీ చూడండి: కరోనా పరీక్ష కిట్ల నాణ్యత తేల్చేందుకు 14 సంస్థలకు లైసెన్స్