దేశంలో కరోనా బాధితుల సంఖ్య 65కు చేరినట్టు తెలుస్తోంది. తాజాగా ముంబయిలోని ఇద్దరికి వైరస్ సోకినట్టు నిర్ధరణ అయ్యింది. అయితే కేంద్ర ఆరోగ్యశాఖ మాత్రం.. దేశంలో ఇప్పటి వరకు 60మందికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్టు పేర్కొంది.
మహారాష్ట్రలో...
మహారాష్ట్రలో ఇప్పటివరకు మొత్తం 10 పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. ఇందులో పుణె నుంచి 8 కేసులున్నట్టు పేర్కొన్నారు. వైరస్ ప్రభావం వల్ల ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను కుదించే అవకాశముందన్నారు.
ఇటలీ దంపతులు...
రాజస్థాన్‌లో ఇటలీ దంపతులకు వైరస్ సోకిన సంగతి తెలిసిందే. వారు జైపూర్‌లోని ఎస్ఎమ్ఎస్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. అయితే ఇటలీ మహిళకు తాజాగా చేసిన పరీక్షల్లో వైరస్ నెగటివ్‌గా తేలినట్టు వైద్యులు స్పష్టం చేశారు. 24 గంటల్లో రెండుసార్లు పరీక్ష చేసినట్టు వివరించారు. భర్త పరిస్థితి కూడా మెరుగుపడుతున్నట్టు వెల్లడించారు.
'అసత్య ప్రచారాలొద్దు...'
అతిసున్నితమైన కరోనా అంశంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న 11మంది మిజోరాం వాసులను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. మిజోరాంలో ఒకరికి వైరస్ సోకినట్టు సామాజిక మాధ్యమాల వేదికగా ఈ 11మంది అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అనంతరం వీరిని బెయిల్‌పై విడుదల చేశారు పోలీసులు.
ఇటలీ నుంచి వచ్చిన వారు..
కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇటలీ నుంచి వచ్చిన 83మందిని.. దిల్లీలోని మానేశ్వర సైనిక కేంద్రంలో నిర్బంధించారు అధికారులు. వీరిలో తొమ్మిది మంది ప్రవాస భారతీయులు, 16మంది చిన్నారులు, ఒక శిశువు ఉన్నారు. వీరందరూ ఎయిర్ ఇండియా విమానంలో.. బుధవారం ఇటలీ నుంచి భారత్‌కు చేరుకున్నారు.