దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. వైరస్‌ను నియంత్రించే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ తరుణంలో భారత సైన్యం కూడా నివారణ చర్యలను చేపట్టింది. దిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న 35 శాతం మంది అధికారులు, 50 శాతం జూనియర్ కమిషన్డ్ అఫీసర్ల(జేసీఓ)లను.. మార్చి 23 నుంచి వారం రోజుల వరకు 'వర్క్ ఫ్రమ్ హోం' చేయాలని సూచించినట్లు అధికారులు తెలిపారు.
అంతేకాకుండా మార్చి 30 నుంచి రెండో బృందం అధికారులు, జేసీఓలను గృహ నిర్బంధం చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే అత్యవసర సమయాల్లో టెలిఫోన్ తదితర మార్గాల్లో ఉద్యోగులు అందుబాటులో ఉండేలా చూస్తున్నట్లు వెల్లడించారు.
సెలవులు పొడగింపు..
కరోనా వైరస్ వల్ల ముప్పు పొంచి ఉన్నందున జమ్ముకశ్మీర్‌లోని తమ సిబ్బందికి మరో 15 రోజుల వరకు సెలవులను పొడగించినట్లు సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ఇప్పటికే కరోనాను నియంత్రించే క్రమంలో అన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు 166వ బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ సింగ్ వివరించారు. వైరస్ నుంచి జాగ్రతగా ఉండేలా సిబ్బందికి ముసుగులు, శానిటైజర్లను పంపిణీ చేశారు.