పొగరాని పొగాకు ఉత్పత్తుల వినియోగంపై మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ సహా 28 రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాలు నిషేధం విధించాయి. దీనితో పాటు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని కూడా నిషేధించాయి. దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం విజ్ఞప్తి మేరకు రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
పొగరాని పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాలు, సుపారీలు.. నోట్లో లాలాజనాన్ని పెంచుతాయని, అందువల్ల పదేపదే ఉమ్మడం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా కరోనా వైరస్ మరింత విస్తరించే అవకాశముందని హెచ్చరించారు. అందువల్ల ఈ పదార్థాలపై నిషేధం విధించాలని ఏప్రిల్ 1వ తేదీనే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది కేంద్రం.
"22 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పొగాకు ఉత్పత్తుల వినియోగం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి."
- కేంద్ర ఆరోగ్యశాఖ అధికారి
కేంద్రం, రాష్ట్రాల నిర్ణయాన్ని నిపుణులు స్వాగతించారు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో పొగ తాగే వారు తమ అలవాట్లను మానుకోవాలని సూచించారు.
నిబంధనలను ఉల్లంఘించేవారికి.. అసోం, చంఢీగఢ్, దిల్లీ, ఝార్ఖండ్, హరియాణా, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు జరిమానాలు కూడా విధిస్తున్నాయి.
ఇదీ చూడండి:- ఐదుగురు ఎయిర్ ఇండియా పైలట్లకు కరోనా