కొవిడ్-19 చికిత్సలో కీలకంగా మారిన ఔషధం ఫవిపిరవిర్‌ను ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఔషధ తయారీ సంస్థ సిప్లా త్వరలో మార్కెట్‌లో ప్రవేశపెట్టనుందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పేర్కొంది. తక్కువ ఖర్చుతో కరోనా ఔషధాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎస్‌ఐఆర్ ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. స్ధానికంగా లభ్యమయ్యే రసాయనాలతో ఈ మందును అభివృద్ధి చేసిన సీఎస్‌ఐఆర్ ఈ సాంకేతికతను సిప్లాకు బదలాయించింది.
ఈ మందు త్వరలో మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుందని సీఎస్‌ఐఆర్ ప్రకటించింది. తాము అభివృద్ధి చేసిన సాంకేతికత అత్యంత సమర్థంగా పనిచేస్తుందని, తక్కువ వ్యవధిలోనే ఔషధ తయారీదారులు పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేపట్టేందుకు అనువైందని సీఎస్‌ఐఆర్-ఐఐసీఆర్ డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ మండే తెలిపారు. ఒక మోస్తరు నుంచి మధ్యస్థంగా కొవిడ్-19తో బాధపడుతున్న రోగుల్లో ఫవిపిరవిర్ మంచి ఫలితాలిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం గ్లెన్‌మార్క్ ఫార్మాకు చెందిన ‘ఫాబిఫ్లూ’ ఔషధం మాత్రమే మార్కెట్లో ఉంది. తాజాగా ఆప్లిమస్ ఫార్మాకు ఈ ఔషధాన్ని దేశీయ మార్కెట్లో విక్రయించటానికి, ఎగుమతి చేయటానికి అనుమతి వచ్చింది. ఫవిపిరవిర్ ట్యాబ్లెట్ తయారీ- విక్రయానికి తమకు కూడా డీసీజీఐ నుంచి అనుమతి వచ్చినట్లు బ్రింటన్ ఫార్మా అనే దేశీయ కంపెనీ వెల్లడించింది. తాజాగా సిప్లా కూడా ఈ ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకురానుంది. బెంగళూరుకు చెందిన స్ట్రైడ్స్ ఫార్మా ఈ ఔషధాన్ని తయారు చేసినప్పటికీ ఇంకా అనుమతి కోసం ఎదురుచూస్తోంది. ఇప్పుడు పోటీ రావడం.. సిప్లా తయారుచేయబోయే ఔషధం చౌకగా లభించే అవకాశం ఉండడంతో ఇంకా తక్కువ ధరకే ఈ ఫవిపిరవిర్ ట్యాబ్లెట్లు రోగులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి : కరోనా సోకిందని తలుపులకు స్టీల్ రేకులతో సీల్!