కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేలా ప్రజల్ని చైతన్య పరిచేందుకు రూపొందించిన కాలర్ ట్యూన్‌లో కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్పులు చేసింది. ఇప్పటి వరకూ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ స్వరంతో వచ్చే ఆ ట్యూన్ స్థానంలో ఓ మహిళ గొంతుక వినిపిస్తోంది.
దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం ప్రారంభమైన వేళ.. కాలర్ ట్యూన్‌లోని విషయం కూడా మారింది. ''కొత్త సంవత్సరం కొవిడ్ టీకాల రూపంలో సరికొత్త ఆశాకిరణాలను తీసుకొచ్చింది. భారత్‌లో రూపొందించిన టీకాలు ఎంతో సురక్షితమైనవి. ప్రభావవంతమైనవి. కరోనా వైరస్ నుంచి అవి కాపాడగలవు. వ్యాక్సిన్లపై వచ్చే వదంతులను విశ్వసించొద్దు. మీ వంతు వచ్చినప్పుడు కచ్చితంగా టీకా తీసుకోండి.'' అని కొత్త కాలర్ ట్యూన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. అంతేకాకుండా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇప్పటి వరకూ పాటిస్తున్న మాస్క్, శానిటైజేషన్ తదితర జాగ్రత్తలన్నీ కొనసాగించాలని సూచిస్తోంది.
అమితాబ్ కంఠ స్వరంతో వచ్చిన ఇదివరకటి కాలర్ ట్యూన్ దగ్గుతో ప్రారంభమయ్యేది. కరోనా జాగ్రత్తల ఆవశ్యకతను వివరించేది. అమితాబ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో దిల్లీ హైకోర్టులో కొద్ది రోజుల క్రితం ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అమితాబ్ స్వరంతో ఉన్న కాలర్ ట్యూన్‌ను తొలగించాలని పిటిషనర్లు కోరారు.
ఇదీ చూడండి:గుజరాత్లో 8 రైళ్లను ప్రారంభించనున్న మోదీ