ప్రపంచవ్యాప్తంగా అందరి ఆలోచన కరోనా గురించే. అన్ని దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి గురించి తెలుసుకునేందుకు కొన్ని వారాలు ఆసక్తి కనబరిచారు నెటిజన్లు. గూగుల్ సెర్చ్‌లో వైరస్ విశేషాల కోసం అత్యధికంగా వెతికారు. అయితే మే నెలలో పరిస్థితి మారినట్లు గూగుల్ తెలిపింది. నెటిజన్లంతా ఎక్కువగా సినిమాలు, వాతావరణ సంబంధిత విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి కనబర్చినట్లు వెల్లడించింది.
కొవిడ్ కేసుల సంఖ్య దేశంతో అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో కరోనా గురించి గూగుల్ సెర్చ్ చేయడం 50 శాతానికిపైగా తగ్గింది. కరోనాకు మునుపటిలా ఇతర విషయాల గురించే నెటిజన్లు ఎక్కువగా వెతుకుతున్నారు.
గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన అంశాల జాబితాలో మే నెలలో 12వ స్థానానికి పడిపోయింది కరోనా. సినిమాలు, వార్తలు, వాతావరణం వంటి అంశాలు టాప్ ప్లేస్‌లోకి వచ్చాయి. కరోనా కారణంగా క్రికెట్ టోర్నమెంట్లు ఎక్కడా జరగడం లేదు. అందుకే క్రికెట్ కంటే ఐదు రెట్లు ఎక్కువగా కొవిడ్-19 గురించే సెర్చ్ చేశారు నెటిజన్లు.
భారతీయులు మే నెలలో రెండింటి గురించే గూగుల్‌లో ఎక్కువగా వెతికారు. అవి 'లాక్డౌన్ 4.0' , ఈద్ ముబారక్. 'Which disease is related to coronavirus?' తో పాటు 'Will lockdown extend after 17 May?' వంటి ప్రశ్నలకు సమాధానాల కోసం విపరీతంగా సెర్చ్ చేశారు.
కరోనా వైరస్ సంబంధిత విషయాల్లో 'coronavirus lockdown zones Delhi' గురించి వెతకడం నెల వ్యవధిలోనే 1800శాతం పెరిగినట్లు గూగుల్ తెలిపింది. అలాగే 'Italy coronavirus vaccine' గురించి సెర్చ్ చేయడం 750శాతం పెరిగినట్లు పేర్కొంది.
కరోనా వైరస్‌కు సంబంధించి వ్యాక్సిన్ గురించే ఎక్కువ మంది నెటిజన్లు వెతికారు. దీని గురించి సెర్చ్ చేయడం మే నెలలో 190 శాతం పెరిగింది.
గోవా, మేఘాలయ, చండీగఢ్‌లో మే నెలలో కరోనా గురించే ఎక్కువగా సెర్చ్ చేశారు నెటిజన్లు.