దేశంలో గత మూడు వారాల్లో కరోనా సగటు వృద్ధిరేటు తగ్గుముఖం పడుతోంది. మొదట రెండంకెల్లో సాగిన వృద్ధి రేటు గత మూడురోజులుగా ఏక అంకెకు (7.42%) పరిమితమైంది. ముఖ్యంగా గత మూడురోజుల్లో ఇది వరసగా 6.92%, 8.43%, 6.91%గా నమోదైంది. కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య మూడు వారాల్లో 9.37 నుంచి 13.62 శాతానికి పెరిగింది. 21 రోజుల క్రితం ప్రతి 10.66 మందికి ఒకరు కోలుకోగా ఇప్పుడు ప్రతి 7.3మందికి ఒకరు ఆరోగ్యవంతులుగా మారుతున్నారు. ఇదే సమయంలో మరణాల నిష్పత్తి మాత్రం 2.63% నుంచి 3.29%కి పెరిగింది. 21 రోజుల క్రితం సగటున 38 మందిలో ఒకరు మృత్యువాత పడగా, ఇప్పుడు ప్రతి 30 మందిలో ఒకరు చనిపోతున్నారు. పాజిటివ్ కేసుల వృద్ధి తగ్గుముఖం పట్టడం, కోలుకున్నవారి నిష్పత్తి పెరుగుతుండటం సానుకూలాంశం.
30%కేసులకు మర్కజ్‌తో సంబంధం
దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 23 రాష్ట్రాల్లోని 4,291 (29.8%) కేసులకు దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో మర్కజ్ (తబ్లీగీ జమాత్ సమ్మేళనం)తో సంబంధం ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. మొదటి 10 స్థానాల్లో ఉన్న రాష్ట్రాల్లోనైతే తమిళనాడులో 84%, తెలంగాణలో 79%, దిల్లీలో 63%, ఆంధ్రప్రదేశ్‌లో 61%, ఉత్తర్‌ప్రదేశ్‌లో 59% కేసులకు దీంతో లంకె ఉన్నట్లు పేర్కొన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో నమోదైన ఏకైక కేసుకు తబ్లీగీతోనే సంబంధం ఉందన్నారు. అసోంలో 91%, అండమాన్‌లో 83% కేసులకూ ఇదే లంకె ఉన్నట్లు చెప్పారు.
కరోనాతో పోలీస్ కమిషనర్ మృతి
కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లూధియానా సహాయ పోలీస్ కమిషనర్ అనిల్ కోహ్లి (52) శనివారం మరణించారు. ఆయన భార్యతోపాటు స్టేషన్ హౌజ్ అధికారికి, సెక్యూరిటీ గార్డుకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.
ఆ ఔషధంతో కడుపునొప్పి!
హైడ్రాక్సీ క్లోరోక్విన్ తీసుకుంటున్న వైద్య సిబ్బందిలో 10% మందికి పొత్తికడుపు నొప్పి వచ్చినట్లు తమ అధ్యయనంలో తేలిందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త గంగా ఖేడ్కర్ పేర్కొన్నారు. ఈ మందు ప్రతికూల ప్రభావాలపై తాము ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు.
'నోడల్ అధికారులను నియమించండి'
కార్మికుల సమస్యల పరిష్కారానికి సంబంధించి కేంద్రంతో సమన్వయం చేసుకునేందుకు వీలుగా నోడల్ అధికారులను నియమించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ శనివారం లేఖ రాశారు. కొవిడ్-19 నేపథ్యంలో ఇటీవల దేశవ్యాప్తంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో 20 కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: హమీర్‌పూర్‌లో 16,000 కుటుంబాలకు కరోనా పరీక్ష!