కేరళలో అతి కష్టం మీద కరోనా ప్రాణాలు కాపాడుకుంది ఓ కుటుంబం. అవును, పైపులో ఇరుక్కుపోయిన ఓ చిన్నారి కరోనా పిల్లిని అగ్నిమాపక సిబ్బంది సాయంతో రక్షించుకుంది.
కరోనా కథేంటంటే...
పాలక్కడ్, కొల్లంగోడ్కు చెందిన విజయలక్ష్మీ ఓ పిల్లిని పెంచుకుంటోంది. ఈ మధ్యే అది పండంటి మూడు పిల్లులకు జన్మనిచ్చింది. కరోనా కాలంలో పుట్టాయి కాబట్టి వాటికి ముద్దుగా.. కొవిడ్, నిఫా, కరోనా అని పేర్లు పెట్టుకుంది విజయలక్ష్మీ కూతురు లక్ష్మీ.
కొవిడ్, నిఫాతో ఇంట్లో అల్లరి చేస్తూ ఆడుకుంటున్న సమయంలో... కరోనా వెళ్లి ఓ పీవీసీ పైపులో దూరింది. తల ఓ వైపుగా బయటకు వచ్చేసింది. రెండు కాళ్లు పైపులో, మరో రెండు కాళ్లు బయట ఉండిపోయాయి. దీంతో పైపు నుంచి బయటకు రాలేక ఇరుక్కుపోయింది కరోనా. దీంతో నిఫా, కొవిడ్ ఏడవడం మొదలెట్టాయి. కరోనాను బయటకు తీసేందుకు విజయలక్ష్మీ కుటుంబమంతా ప్రయత్నించింది కానీ ఫలితం దక్కలేదు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ప్రశాంత్కు ఫోన్ చేశారు.
చాలా సేపు శ్రమించి, పైపును కోసి ఎట్టకేలకు కరోనాను సురక్షితంగా బయటకు తీశాడు ప్రశాంత్. ఇంకేముంది కరోనా తల్లి దగ్గరకు పరుగులు తీసింది. మళ్లీ ఆనందంగా గెంతుతున్న కరోనాను చూసి విజయలక్ష్మీ కుటుంబమంతా సంతోషం వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి:తక్షణ శక్తి కోసం.. సినమన్ హాట్ చాక్లెట్