దేశంలో కరోనా కేసులు 194కు చేరాయి. గురువారం కొత్తగా 25 మందిలో వైరస్ ఉన్నట్లు బయటపడింది. ఇప్పటికే వైరస్ ధాటికి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. వ్యాధి నుంచి 20 మంది కోలుకున్నారు. మరో 170 మందికి వివిధ రాష్ట్రాల్లో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు..
వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన కేంద్రం.. ఈనెల 22 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. 65 ఏళ్ల పైబడినవారితో సహా.. పదేళ్లలోపు చిన్నారులను ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచించింది. కేంద్ర ప్రభుత్వ గ్రూప్-బీ, సీ ఉద్యోగులు 50 శాతమే రోజూ రావాలని.. వారానికి ఒకసారి ఈ విధానం మార్చుకోవాలని ఆదేశించింది. బీ, సీ కేటగిరీలు మినహా మిగతా ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా చూడాలని కోరింది.
ఆ ఎగుమతులపై నిషేధం..
మెట్రోలు, రైల్వేలు, బస్సులు, విమాన సర్వీసుల సంఖ్య తగ్గించాలని కోరింది. ప్రభుత్వ ఉద్యోగులకు వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని రాష్ట్రాలకు సూచించింది. వైద్యానికి సంబంధించిన అన్ని రకాల వెంటిలేటర్లు, శస్త్రచికిత్స పరికరాలు, మాస్క్‌ల ఎగుమతిపై నిషేధం విధించింది.
ఇదీ చదవండి: 'కరోనాపై యుద్ధం కోసం.. వచ్చే ఆదివారం జనతా కర్ఫ్యూ'