మహరాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. మంగళవారం 2,287 కొత్త కేసులు నమోదయ్యాయి. 103 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 72,300, మృతుల సంఖ్య 2,465కు చేరింది.
24 గంటల్లో 1,225 మంది రోగులు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రులను నుంచి డిశ్చార్జి అయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తం 31,333 మంది కోలుకున్నారని తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 38,493 యాక్టివ్ కేసులు ఉన్నట్లు స్పష్టం చేసింది.
తమిళనాడులో హ్యాట్రిక్...
తమిళనాడులో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఆ రాష్ట్రంలో వరుసగా మూడోరోజు వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,091 కేసులు నమోదు కాగా, 13 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసులు సంఖ్య 24,586, మృతుల సంఖ్య 197 కు చేరింది.
ఒక్కరోజులో అత్యధిక కేసులు..
కేరళలో కరోనా వేగం పుంజుకుంటోంది. మంగళవారం కొత్తగా 86 మందికి వైరస్ సోకింది. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. రాష్ట్రంలో మొత్తం 1,412 మంది వైరస్ బారిన పడ్డారు.
గుజరాత్లో మరో 415 మంది కరోనా బారిన పడ్డారు. కొత్తగా 29 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 17,632 మందికి వైరస్ నిర్ధరణ కాగా.. మృతుల సంఖ్య 1,092కు చేరింది.
అసోంలో కొత్తగా 28 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,513 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.