దేశంలో కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్, బంగాల్లో మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో బాధితులు నానాటికీ పెరిగిపోతున్నాయి.
మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో కొత్తగా 9,615 మందికి వైరస్ సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 3,57,117కు చేరింది. మరో 278 మంది మృతితో.. మరణాల సంఖ్య 13,132కు పెరిగింది. ఆ రాష్ట్రంలో శుక్రవారం కొవిడ్ నుంచి కోలుకుని 5,712 డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు సుమారు 2 లక్షల మందికి వైరస్ నయమైంది.
ముంబయిలో మరో వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా నగరంలో మొత్తం కేసుల సంఖ్య 1,06,891 కు పెరిగింది. మరో 54 మంది వైరస్ ధాటికి బలవ్వగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,981కు చేరింది.
ఉత్తర్ప్రదేశ్లో కొత్త రికార్డు..
ఉత్తర్ప్రదేశ్లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలోనే రికార్డుస్థాయిలో 2,667 వైరస్ కేసులు బయటపడ్డాయి. మరో 50 మంది వైరస్ సోకి చనిపోయారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో మొత్తంగా 60,771 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1,298 మంది మరణించారు. 37,712 మంది డిశ్చార్జ్ కాగా.. 21,711 మంది చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
తమళనాట రికార్డు స్థాయిలో..
తమిళనాడులో కరోనా కోరలు చాస్తోంది. కొత్తగా రికార్డు స్థాయిలో 6,785 కొత్త కేసులు నమోదుకాగా.. మొత్తం బాధితుల సంఖ్య 2 లక్షలకు చేరువైంది. మరో 88 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 3,320 మంది మరణించారు. కొవిడ్ నుంచి కోలుకొని 1,43,297 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మరో 53,132 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
కర్ణాటకలో 5 వేలకు పైనే..
కర్ణాటకలో కొత్తగా 5007 కేసులు బయటపడ్డాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 85,870కు ఎగబాకింది. ఒక్కరోజు వ్యవధిలో 110 మంది మహమ్మారి సోకి మరణించగా.. మృతుల సంఖ్య 1,724 కు చేరింది.
దిల్లీలో వెయ్యికిపైగా..
దేశ రాజధాని దిల్లీలో ఒక్కరోజు వ్యవధిలో సుమారు 1025 మందికి కరోనా సోకింది. ఫలితంగా ఇప్పటివరకు మొత్తం 1,28,389 కేసులు నమోదయ్యాయి. మరో 32 మంది వైరస్ సోకి మరణించగా.. చనిపోయిన వారి సంఖ్య 3,777కు చేరింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 1,10,931 మందికి వైరస్ నయమైంది.
బంగాల్లో అలా..
పశ్చిమబంగాలో శుక్రవారం 2,216 వైరస్ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో మొత్తం 53,973 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో 35 మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య 1,290 కు చేరింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 33,529 మందికి కరోనా నయమవ్వగా.. 19,154 మంది చికిత్స పొందుతున్నారు.
గుజరాత్లో ఇలా..
గుజరాత్లో కొవిడ్ బాధితుల సంఖ్య 53 వేలు దాటింది. ఒక్కరోజు వ్యవధిలో 1,068 కరోనా కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి ధాటికి మరో 26 మంది బలవ్వగా.. మరణాల సంఖ్య 2,283కు చేరింది. అయితే ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 38,830 మందికి వైరస్ నయమైంది.
ఇదీ చదవండి: కరోనా ట్యాబ్లెట్ ఫవిపిరవిర్ ఇక మరింత చౌక!