రైతుల ఆందోళనలు, వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలను వెంటనే నిర్వహించాలని కాంగ్రెస్ నేత, ఎంపీ మనీశ్ తివారీ డిమాండ్ చేశారు. వీటితో పాటు సరిహద్దులో చైనా దూకుడు, ఆర్థిక వ్యవస్థ పతనం, కరోనా మహమ్మారిపైనా సభలో చర్చించాలని అన్నారు. కరోనా వల్ల బాధ్యతల నుంచి తప్పించుకోకుండా పార్లమెంట్ సభ్యులంతా ఉదాహరణగా నిలవాలని పేర్కొన్నారు.
రైతుల సమస్యలపై చర్చించేందుకు పార్లమెంటే సరైన వేదిక అని అన్నారు మనీశ్. స్టాండింగ్ కమిటీలు, సంయుక్త పార్లమెంటరీ కమిటీలు తరచుగా సమావేశాలు జరుపుతున్నాయని.. అలాంటప్పుడు శీతాకాల సమావేశాన్ని నిర్వహించకుండా ఉండేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని పేర్కొన్నారు.