కుల్‌భూషణ్ జాదవ్‌కు అందిన దౌత్య సహాయం నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తమకు ఎలాంటి షరతులు లేకుండా అనుమతులివ్వాలని కోరగా.. పాకిస్థాన్ అందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తించిందని భారత్ ఆరోపించింది. దౌత్య అధికారులు జాదవ్‌తో ఉండగా.. భయపెట్టే రీతిలో పాక్ అధికారులు కుల్‌భూషణ్‌తో ప్రవర్తించారని మండిపడింది.
పాక్ చర్యలతో.. మాజీ నౌకాదళ అధికారి హక్కుల గురించి భారత్ ప్రస్తావించలేక పోయిందని, న్యాయవాదిని ఏర్పాటు చేసేందుకు ఆయన నుంచి లిఖితపూర్వక వాంగ్మూలం పొందలేకపోయిందని విదేశాంగశాఖ వెల్లడించింది.
భారత్ అధికారులతో జాదవ్ సంభాషణలు పాక్ రికార్డు చేసినట్టు పేర్కొంది విదేశాంగ శాఖ. సమావేశం ఆద్యంతం జాదవ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు గుర్తించినట్టు స్పష్టం చేసింది. 2019లో అంతర్జాతీయ కోర్టు తీర్పును అమలు చేయడంలో పాక్ పూర్తిగా విఫలమైందని తెలిపింది.
పాక్ ఏర్పాటు చేసిన దౌత్య సాయం అర్థరహితంగా ఉందని, విశ్వసనీయత లోపించిందని భారత అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై తమ నిరసన తెలిపిన అనంతరం వారు అక్కడి నుంచి వెనుదిరిగినట్టు భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది.
ఈ పూర్తి వ్యవహారాన్ని కుల్‌భూషణ్ జాదవ్ కుటుంబసభ్యులకు వివరించినట్టు విదేశాంగశాఖ వెల్లడించింది. జాదవ్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నట్టు మరోమారు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి- 'కులభూషణ్' కేసులో పాక్ వైఖరి తప్పే: ఐసీజే