పేదలకు ఏడాదికి రూ.72వేలు ఇచ్చేలా కనీస ఆదాయ పథకాన్ని ప్రవేశ పెడతామన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హమీపై తీవ్రంగా మండిపడ్డారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. పేద ప్రజలను మరోసారి మోసం చేసేందుకే కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇస్తోందని విమర్శించారు.
రాహల్ ఇచ్చిన హామీతో పోల్చితే.. మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల కారణంగా ఇప్పటికే పేదలు ఒకటిన్నర రెట్లు లబ్ధి పొందుతున్నారని వివరణ ఇచ్చారు జైట్లీ.
పేదల పేరుతో కాంగ్రెస్ రాజకీయ పబ్బం గడుపుకుందే తప్ప పేదరిక నిర్మూలనకు కార్యాచరణ రూపొందించలేదని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం పేదలకు ఆర్థిక వనరులు సమకూర్చి వారి అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ఏనాడు ఇలాంటి ఆలోచన చేయలేదన్నారు జైట్లీ.
"కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ల పాటు పేదలను విస్మరించింది. 'గరీబీ హఠావో' నినాదం తర్వాత కూడా పేదరిక నిర్మూలన కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం దేశంలో 20 శాతం మంది ప్రజలు, సగటున ఐదుగురిలో ఒక్కరి కనీస ఆదాయం రూ.12వేలు లేదని మీరే చెబుతున్నారు. దేశంలో పేదరికానికి మీరే బాధ్యులు."
-అరుణ్ జైట్లీ, ఆర్థిక మంత్రి.