వచ్చే ఏడాది బంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో.. పార్టీ సన్నద్ధతపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం సమీక్ష నిర్వహించనున్నారు. వర్చువల్‌గా జరిగే ఈ భేటీలో బంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి, బంగాల్ ఇన్ఛార్జ్ జితిన్ ప్రసాద, సీఎల్పీ నేత అబ్దుల్ మన్నన్ పాల్గొననున్నారు.
కాంగ్రెస్ వ్యూహమేంటి?
294 సభ్యుల బంగాల్ శాసనసభకు వచ్చే ఏడాది పోలింగ్ జరగనుంది. రాష్ట్రంపై భాజపా పట్టు పెరుగుతున్న తరుణంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం తృణమూల్ కాంగ్రెస్‌కు సవాలుగా మారింది. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసి ఎన్నికల్లో రాణించేందుకు కాంగ్రెస్ ఎలాంటి చర్యలు చేపడుతుందనేది కీలకంగా మారింది.
2016 ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి బరిలో దిగిన కాంగ్రెస్.. 44 స్థానాలు దక్కించుకుని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఆ తర్వాత సగం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు.
ఇదీ చూడండి:- బంగాల్ దంగల్: దీదీ సేనలో అసమ్మతి జ్వాల!
ఈసారి పొత్తు వ్యవహారంలో మరింత అనిశ్చితిలోకి జారుకుంది కాంగ్రెస్. టీఎంసీతో కలిసి ముందుకు వెళ్లాలా? లేక వామపక్షాలతోనే కొనసాగాలా? అన్న విషయంపై నేతలు మంతనాలు జరుపుతున్నారు.
సీడబ్ల్యూసీ భేటి..
కాంగ్రెస్‌లోని కీలక నేతలు అహ్మద్ పటేల్, తరుణ్ గొగొయి.. వారం రోజుల వ్యవధిలో కన్నుమూశారు. వీరికి నివాళులర్పించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శుక్రవారం భేటీ కానుంది. ఉదయం 11గంటలకు వర్చువల్‌గా జరగనున్న ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులతో పాటు ఇతరులు పాల్గొంటారని పార్టీ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
ఇదీ చూడండి:- 'ఫార్ములా 23'తో భాజపా 'బంగాల్ మిషన్-200'