ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానించారు. అయితే కరోనా నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
"వరుసగా 17వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది కేంద్రం. అంతేకాకుండా ఇప్పటికే డీజిల్‌పై 820 శాతం, పెట్రోల్‌పై 258 శాతం ఎక్సైజ్ సుంకాన్ని మోపింది. ఈ తరహా పెరుగుదలతో సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతుంది. కరోనా సంక్షోభ సమయంలో పెరుగుదల భారత ప్రజలపై మరింత భారం పడుతుంది.ఈ నేపథ్యంలో దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని సీడబ్ల్యూసీలో తీర్మానించాం."
- కేసీ వేణుగోపాల్
ఇంధన ధరల పెరుగుదలతో పాటు పలు అంశాలపై కేంద్రానికి సూచనలు చేసింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిదినాలను 100 నుంచి 200లకు పెంచాలని కోరింది. పేదప్రజలకు ప్రత్యక్ష నగదు బదిలీ కింద ఆర్థిక సాయం చేయాలని సూచించింది.