అంతర్గత సంక్షోభాలు, అసమ్మతి రాజకీయాలు కాంగ్రెస్‌కు కొత్తేమీ కాదు. ప్రస్తుతమూ అలాంటి పరిస్థితే నెలకొంది. పార్టీని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని కోరుతూ.. 23 మంది ప్రముఖ నేతలు అధ్యక్షురాలికి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. లేఖలోని విషయాల మాట ఎలా ఉన్నా రాహుల్ గాంధీతో వారికి అంతగా సత్సంబంధాలు లేకపోవడం ఇందుకు ఓ కారణంగా కనిపిస్తోంది.
అదే ఆసక్తికరం..
రాజకీయ వర్గాల విశ్లేషణ ప్రకారం.. పార్టీలో తమ స్థానాన్ని కాపాడుకోవడానికే వారు అసమ్మతి గళాన్ని వినిపించినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే తమ పదవికి ముప్పు కలుగుతుందన్న భావనతోనే వారు ఈ లేఖ రాసినట్టుంది. రాహుల్‌కు మళ్లీ పార్టీ బాధ్యతలు అప్పగించాలని పార్టీలో ఒక వర్గం గత కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. అయితే అందుకు ఆయన నిరాకరిస్తూ వస్తున్నారు. సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కూడా తాను ప్రధాన కార్యదర్శి పదవికే పరిమితమవుతానని, అంతకుమించి బాధ్యతలు తీసుకోనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 'గాంధీ కుటుంబ సభ్యుల ప్రమేయంతో సమష్టి నాయకత్వం' అన్న భావన తెరపైకి వచ్చింది. దీనికి 23 మంది నాయకులు రాసిన లేఖ తోడైనందున పార్టీలోని విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ లేఖపై ఏ నాయకుడు ఏ కారణంతో సంతకం చేశారన్న అంశం ఆసక్తికరంగా మారింది.
గులాంనబీ ఆజాద్:
రాజ్యసభలో విపక్షనేతగా వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీకాలం 2021 ఫిబ్రవరి 10తో పూర్తవుతుంది. ఎగువసభకు మళ్లీ ఎన్నికయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఆయన తరవాత మల్లికార్జున ఖర్గేకు విపక్షనేత పదవి అప్పగించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. పార్టీలో తన ఉనికిని కాపాడుకోవడానికే అన్ని స్థాయిల్లో పార్టీని ప్రక్షాళన చేయాలన్న డిమాండుకు మద్దతిచ్చారని తెలుస్తోంది.
మిలింద్ దేవరా, ముకుల్ వాస్నిక్:
మహారాష్ట్రకు చెందిన ఈ ఇరువురు నేతలు గత కొంతకాలంగా రాహుల్‌పై అసంతృప్తితో ఉన్నారు. మిలింద్ దేవరా రాజ్యసభ స్థానాన్ని ఆశించగా.. దాన్ని పి. చిదంబరానికి కట్టబెట్టారు. దేవర కూడా భాజపావైపు చూస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దళిత నాయకుడైన ముకుల్ వాస్నిక్‌కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఇది 'ప్రథమ కుటుంబా'నికి నచ్చకపోవడం వల్ల ఆయనకు ప్రాధాన్యం తగ్గించినట్టు తెలుస్తోంది.
రాజ్‌బబ్బర్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ:
రాజ్‌బబ్బర్ రాజ్యసభ పదవీకాలం మే 25తో పూర్తికానుంది. ప్రస్తుతం ఆయన ఉత్తరాఖండ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. మళ్లీ ఎన్నికయ్యే అవకాశాలు లేవు. గత ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తర్‌ప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కపిల్ సిబల్, ఆనంద్ శర్మల రాజ్యసభ పదవీకాలం 2022 వరకు ఉంది. అయితే వారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యులు కారు. వారిపై రాహుల్ గాంధీకి సదభిప్రాయం లేకపోవడం వల్ల.. పార్టీలో సముచిత స్థానం ఉండదని వారు అనుమానిస్తున్నారు.
జితిన్ ప్రసాద:
వర్కింగ్ కమిటీ సభ్యుడైన ఆయన ఉత్తర్‌ప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించారు. కానీ దానిని అజయ్ లల్లూకు ఇచ్చారు. దీంతో రాహుల్ గాంధీ అధ్యక్షుడైతే పార్టీలో తన స్థానం ఏమిటన్నదానిపై ఆయనలో అనుమానాలున్నాయి.
భూపీందర్ సింగ్ హుడా, హరియాణా మాజీ ముఖ్యమంత్రి:
తనకు బద్ధవిరోధి అయిన కుమారీ షెల్జాకు పీసీసీ పదవి ఇవ్వడం.. ఆయనకు ఏమాత్రం ఇష్టంలేదు. ఆ పదవి తనకే ఉండాలని ఆయన ఎప్పటినుంచో కోరుతున్నారు. లేఖపై సంతకాలు చేసిన ఇతర నేతలకు కూడా ఇలాంటి వ్యక్తిగత కారణాలే ఉన్నాయి.
ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాతే కాంగ్రెస్‌కు కొత్త సారథి!