దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలు 100 కిలోమీటర్లకుపైగా కాలినడకన సొంత ఊళ్లకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. దేశంలోని పలు రాష్ట్రాల్లో చిక్కుకుని స్వగ్రామానికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న వారికి రవాణా సౌకర్యాలు కల్పించాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు సోనియా.
" ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారికి సాయం అందించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. నా తరఫున రెండు సూచనలు చేస్తున్నా. కాలినడకన వెళ్లే వారు తమ గ్రామాలను చేరుకునేందుకు రాష్ట్ర రవాణా సౌకర్యాన్ని ఒక్కరోజు కల్పించండి. లాడ్జీలలో, అతిథి గృహాల్లో గడిపే స్తోమత లేని వారికి ఆశ్రయం కల్పించేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. "
-లేఖలో సోనియా గాంధీ.
ప్రియాంక వీడియో
వేలాది మంది వలస కూలీలు కాలినడకన వెళ్తుంటే బాధగా ఉందని ట్విట్టర్లో వీడియో సందేశం పోస్ట్ చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. పేద ప్రజలకు సాయం అందించడం మన బాధ్యత కాదా? అని ప్రశ్నించారు.
" దిల్లీ సరిహద్దు నుంచి ఉత్తర్ప్రదేశ్ వైపు వేలాది మంది వలసదారులు కాలినడక వెళ్తుండటం చూస్తే విచారంగా ఉంది. విదేశాల్లో ఉన్న ఎంతో మందిని ప్రత్యేక విమానాల ద్వారా తీసుకొస్తున్నాం. విపత్కర పరిస్థితుల్లో కుటుంబంతో ఉండాలని అందరూ కోరుకుంటారు. వారందిరికీ సాయం అందించాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నా. ఒత్తిడిలో ఉన్నవారిని ఆదుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసిరావాలి."
-ప్రియాంక గాంధీ ట్వీట్