ఊహాగానాలకు తెరపడింది. దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- ప్రియాంక గాంధీ ఎన్నికల పోరు ఈ ఎన్నికల్లో లేనట్టే. ఉత్తరప్రదేశ్ మాజీ శాసనసభ్యుడు అజయ్ రాయ్‌ను వారణాసి లోక్‌సభ స్థానం నుంచి బరిలో దింపుతున్నట్టు కాంగ్రెస్ గురువారం ప్రకటించింది.
వరుస ప్రకటనలు...
ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌కు పరోక్షంగా సేవలందించిన ప్రియాంక గాంధీ... ఫిబ్రవరిలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
సార్వత్రిక ఎన్నికల్లో సోదరుడు రాహుల్ గాంధీకి అండగా నిలుస్తున్న ప్రియాంక... కాంగ్రెస్ అధ్యక్షుడు కోరితే వారణాసి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమన్నారు. ఈ విషయంపై స్పందించిన రాహుల్... 'ఎదురుచూడండి' అంటూ ఆ ఉత్కంఠను పెంచారు.
ప్రియాంక తొలిసారి ఎన్నికల బరిలో దిగుతారని అందరూ అనుకున్నారు. అదీ 2014లో వారణాసి నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన ప్రధాని మోదీకి ప్రత్యర్థిగా నిలుస్తారనే ఊహాగానాలతో దేశం వీరి పోటీ కోసం ఆసక్తిగా ఎదురుచూసింది. కానీ 2014లో మోదీపై పోటికి దిగి ఓడిన అజయ్ రాయ్‌నే మరోసారి బరిలో దించింది కాంగ్రెస్ అధిష్ఠానం.
మరో కీలక స్థానానికి...
వారాణాసితో పాటు గోరఖ్‌పుర్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. భాజపా అభ్యర్థి, నటుడు రవి కిషన్‌తో మధుసూదన్ తివారీ పోటీపడనున్నారు.
సార్వత్రిక ఎన్నికల చివరి విడతలో భాగంగా మే 19న వారణాసిలో పోలింగ్ జరగనుంది.
ఇదీ చూడండి: 'నిప్పుతో చెలగాటమా..? ఇక చాలు'