ప్రభుత్వ సంస్థలను మోదీ నాశనం చేస్తున్నారనికాంగ్రెస్ చేసిన విమర్శలపై ఎదురుదాడి చేశారు ప్రధాని. గతంలో అధికార దాహం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంస్థలను అవమానపరిచిందని మోదీ ఆరోపించారు. ఈ విషయాల్ని ప్రజలంతా జాగ్రత్తగా గమనించి సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
"ఓటు వేసే ముందు గతాన్ని గుర్తుంచుకోండి. అధికారమే పరమావధిగా ఉన్న ఒక కుటంబ పాలన వల్ల దేశం ఎంతో నష్టపోయింది. పత్రికల నుంచి పార్లమెంటు వరకు, సైనికుల నుంచి వాక్ స్వాతంత్ర్యం వరకు, రాజ్యాంగం నుంచి న్యాయస్థానాల దాకా.. అన్నీ కాంగ్రెస్ హయంలోనే అవమానానికి గురయ్యాయి. వాళ్ల దృష్టిలో అందరు చేసేది తప్పు. వారు చేసేది మాత్రమే ఒప్పు. అప్పుడు అలా చేసిన వారు.. ఇప్పుడు అధికారంలోకి వస్తే కచ్చితంగా అలాగే చేస్తారు. "
-ట్విటర్లో మోదీ
ఎన్డీఏ పాలనలో ప్రభుత్వ సంస్థలకు అధిక ప్రధాన్యమిచ్చి ఉన్నతంగా నిలిపామని మోదీ తెలిపారు. భాజపా అధికారం చేపట్టడాన్ని కాంగ్రెస్ సహించ లేక పోతోందని ఆరోపించారు.
యూపీఏ పాలనవైఫల్యాలను ఎండగడుతూ చాలా ఉదహరణలు తన బ్లాగ్లో పొందుపరిచారు మోదీ.
"కాంగ్రెస్ పాలనలో అత్యయిక పరిస్థితిని దాదాపు వంద సార్లు విధించారు. ఇందిరా గాంధీ హయాంలోనే యాభైసార్లకు పైగా అర్టికల్ 356ను అమలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు వెనుకాడబోరు. జస్టిస్ దీపక్ మిశ్రా సంఘటనే అందుకు ఉదాహరణ. వారికి అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయమూర్తుని నిందిస్తారు. కాగ్, ప్లానింగ్ కమిషన్లను కాంగ్రెస్ ఏనాడు గౌరవించలేదు. స్వాతంత్రం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం రక్షణ ఒప్పందాల్లో ఎన్నో కుంభకోణాలకు పాల్పడింది."
--- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.