కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల ప్రణాళికకు తుది మెరుగులు దిద్దేందుకు పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశమైంది. ఈ భేటీకి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షత వహిస్తున్నారు. సీడబ్లూసీలోని అగ్రనాయకులు హాజరయ్యారు. ఏప్రిల్ 11 నుంచి లోక్సభ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన తుదిఅంశాలపై చర్చించారు నేతలు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా మేనిఫెస్టో ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, అహ్మద్ పటేల్, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్ సహా ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. గత నెలలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు స్వీకరించిన ప్రియాంక గాంధీ, జ్యోతిరాధిత్య సింధియా సైతం సమావేశంలో పాల్గొన్నారు.
మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ ఎన్నికల ప్రణాళిక ముసాయిదాను సిద్ధం చేసింది. ఎన్నికల్లో అన్నివర్గాల ఆకాంక్షల్ని ప్రతిబింబించేలా కాంగ్రెస్ కసరత్తు చేసినట్లు కమిటీ పేర్కొంది. ఆయా వర్గాల అభిప్రాయాలను సేకరించి మేనిఫెస్టో రూపొందించింది. వెబ్ పోర్టల్లోనూ ప్రజల సూచనలు స్వీకరించారు కమిటీ సభ్యులు.