మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేయాలని భావిస్తోంది కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా భాజపా-శివసేన అధికార కూటమిని ఓడించడమే లక్ష్యంగా ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నాయి ఆ పార్టీలు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఓ స్పష్టతనిచ్చాయి.
కాంగ్రెస్-ఎన్సీపీలు చెరో 123 నుంచి 125 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. మరో 41 సీట్లను కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయించనున్నట్లు తెలిపారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్. కాంగ్రెస్-ఎన్సీపీల ఏకాభిప్రాయంతో సీట్లు మార్చుకునే అవకాశమూ ఉందన్నారు. ప్రకాశ్ అంబేడ్కర్‌కు చెందిన వంచిత్ బహుజన్ అఘాదీ, స్వాభిమాని , షేత్కారీ సంఘటన, సమాజ్‌వాదీ పార్టీలతో చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు.
'ముప్పులో రాజకీయ పార్టీలు'..
భాజపాలోకి చేరికలు ఎక్కువవుతుండటంతో ఈ అంశంపై మాట్లాడారు చవాన్. ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి హృదయం వంటి పలు రాజకీయ పార్టీలు ప్రస్తుతం ముప్పులో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత.
అత్యవసర పరిస్థితి సమయంలో అనుభవించిన.. ఒకే పార్టీ పాలన కిందకు దేశాన్ని తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. విపక్ష సభ్యుల్ని భయభ్రాంతులకు గురిచేసి భాజపాలోకి చేర్చుకుంటున్నారని దుయ్యబట్టారు. వాజ్‌పేయీ ప్రభుత్వం 2003లో తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ ప్రకారం ఒక పార్టీలో గెలిచి, ఇతర పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
ఇదీ చూడండి: ఆంధ్రప్రదేశ్‌కు అతిపెద్ద... తెలంగాణకు అతిచిన్న!