దక్షిణ భారతంలోని ఏదో ఒక స్థానం నుంచి రాహుల్ పోటీ చేయాలని పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఉమెన్ చాండీ తెలిపారు.
" కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దక్షిణ భారత్ నుంచి అందులో వయనాడ్ స్థానంలో పోటీ చేయాలని కోరాం. మా వినతిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ సానుకూల స్పందన ఉందని మేము భావిస్తున్నాం. "- ఉమెన్ చాండీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి.
కేరళలోని 20 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 16 సీట్లలో పోటీ చేస్తోంది. ఇప్పటికే 14 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. వయనాడ్, వడకర స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు.
కేరళలో పార్టీ ప్రచారాన్ని ప్రారంభించడానికి రాహుల్ వచ్చిన సందర్భంలో వయనాడ్ నుంచి పోటీ చేయాలని కోరినట్లు రాష్ట్ర ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల తెలిపారు. దక్షిణ భారత్, ఉత్తర భారత్లో రాహుల్ పోటీ చేస్తే జాతీయ ఐక్యత బలోపేతమవుతుందని తెలిపారు.
తమిళనాడు, కర్ణాటక కాంగ్రెస్ పార్టీలు సైతం ఆయా రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ తన కంచుకోట అమేఠీ నుంచి బరిలో ఉంటున్నారని ఇప్పటికే ప్రకటించింది కాంగ్రెస్.