పంజాబ్, హరియాణా, దిల్లీల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఆప్ సుముఖత వ్యక్తం చేసిన కొన్ని గంటల్లోనే కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవైపు ఆప్ నేత సంజయ్ సింగ్, ఎన్సీపీ అధినేత శరద్పవార్తో పొత్తుల విషయమై భేటీ అయ్యారు.
సీట్ల బేరం
దిల్లీలో ఆప్-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకంపై కేజ్రీవాల్ పార్టీ ఓ ప్రతిపాదన చేసింది. దిల్లీలో ఆప్ 5 స్థానాల్లో పోటీ చేస్తుందని, కాంగ్రెస్కు 2 సీట్లు ఇస్తామని ప్రతిపాదించింది. అలాగే పంజాబ్లో -3, హరియాణాలో -2 స్థానాల్లో పోటీ చేయాలని ఆప్ భావిస్తోంది. అయితే ఆప్ ప్రతిపాదనలను కాంగ్రెస్ తిరస్కరించింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఆప్తో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆప్తో పొత్తు దీర్ఘకాలంలో కాంగ్రెస్కు చేటు తెస్తుందని ఆమె భావిస్తున్నారు.
పొత్తు కుదరడం లేదు..
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపాను ఓడించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నా, పొత్తు విషయంలో రెండు పార్టీలు ఓ కొలిక్కిరాలేకపోతున్నాయి. ముందుగా ఆప్ తమది ఒంటరి పోరని ప్రకటించింది. ఇప్పుడు కాంగ్రెస్, ఆప్తో పొత్తుకు ససేమిరా అంటోంది.
ఆప్ ప్రచారం షురూ...
ఆప్ నేత గోపాల్ రాయ్ ఆప్ తన ఎన్నికల ప్రచారాన్ని రెండు విడతలుగా నిర్వహిస్తుందని తెలిపారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 7 వరకు మొదటి దఫా, రెండో విడత ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 30 వరకు ఎన్నికల ప్రచారం చేస్తామని తెలిపారు. మొత్తంగా 208 జనసభలు నిర్వహించడానికి ప్రణాళిక వేసినట్లు ఆయన తెలిపారు.