భారత్‌లో కొవిడ్-19 విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం నాటికి కరోనా బాధితుల సంఖ్య 50 లక్షల మార్కును దాటింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసింది కాంగ్రెస్. మహమ్మారిని కట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేసింది. కేసులను 'యాక్ట్ ఆఫ్ గాడ్' అనుకుని దేవుని ఖాతాలోనే వేస్తారా? అని ప్రశ్నించారు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా.
"కరోనా మహమ్మారి మహాభారత యుద్ధంలా ఉంది. కానీ అందులో మోదీ ప్రభుత్వ పోరాటం లేదు" అని సుర్జేవాలా ఎద్దేవా చేశారు. కరోనా గురించి ప్రధాని వాస్తవాలు చెప్పాలంటూ.. కొన్ని ప్రశ్నలు సంధించారు. వైరస్ తీవ్రతను తెలియచేసేలా వాటికి సమాధానాలనూ పొందుపరిచారు.
- దేశవ్యాప్తంగా రోజుకు ఎన్ని కరోనా కేసులు నమోదవుతున్నాయి?
( 90,123 కేసులతో ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది)
- కరోనా కారణంగా రోజూ మరణిస్తున్న వారి శాతమెంత?
(1290 మరణాలతో ప్రపంచంలోనే భారత్ టాప్-1లో కొనసాగుతోంది)
- దేశంలో కరోనా కేసులు ఎన్ని రోజుల్లో రెట్టింపు అవుతున్నాయి?
(31 రోజుల్లో కేసులు రెట్టింపు అవుతూ.. ఈ జాబితాలో ప్రపంచంలోనే తొలిస్థానంలో భారత్ ఉంది)
"మొత్తం కరోనా కేసుల్లో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. 9లక్షల 95వేల 933 యాక్టివ్ కేసులతో ప్రపంచంలో రెండో స్థానంలోనూ.. 82,006 మరణాలతో.. ప్రపంచంలో అత్యధిక మృతుల జాబితాలో మూడో స్థానంలో భారత్ ఉంది" అని పేర్కొంది కాంగ్రెస్.
"కరోనా కట్టడిలో వైఫల్యాన్ని దేవుడి ఖాతాలోనే వేస్తారా?" అంటూ మోదీ సర్కార్‌ను నిలదీశారు సుర్జేవాలా. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, జీఎస్టీ వసూళ్లపై కరోనా ప్రభావం.. 'యాక్ట్ ఆఫ్ గాడ్' అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ ప్రశ్న వేశారు.