లోక్‌సభ ఎన్నికల రెండు విడతలు పూర్తయ్యాయి. నేడు మూడో దశ. ఇంకా మిగిలున్న దశలకోసం అభ్యర్థుల ఎంపికలో ప్రధాన పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా దిల్లీలో క్రీడాకారుల్ని బరిలోకి దింపి పోరును రసవత్తరంగా మార్చాయి. మే 12న ఇక్కడ పోలింగ్ జరగనుంది.
ఇప్పటికే 7 స్థానాల్లో తమ అభ్యర్థుల పేర్లు ప్రకటించి ఎన్నికలకు సిద్ధంగా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ. తాజాగా కాంగ్రెస్.. అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. భాజపా.. ఒక్క స్థానం మినహా మిగతా ఆరు చోట్ల పేర్లు ప్రకటించింది.
భాజపా నుంచి క్రికెటర్ గౌతమ్ గంభీర్, మీనాక్షి లేఖి...
భారత మాజీ క్రికెటర్, ఓపెనర్ గౌతమ్ గంభీర్ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎప్పటినుంచో భాజపాకు మద్దతుగా మాట్లాడుతున్న ఈ లెఫ్ట్‌హ్యాండర్ బ్యాట్స్‌మెన్‌ను తూర్పు దిల్లీ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది కమలదళం. ఇక్కడి గంభీర్ ప్రత్యర్థులు అర్విందర్ సింగ్ లవ్లీ(కాంగ్రెస్), అతిషి(ఆప్).
'మీనాక్షి లేఖి'ని న్యూ దిల్లీ లోక్‌సభ స్థానం అభ్యర్థిగా ప్రకటించింది భాజపా. ఈమె.. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్, ఆమ్ ఆద్మీ అభ్యర్థి బ్రజేష్ గోయల్ నుంచి పోటీ ఎదుర్కోనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై.. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసి ఇటీవల వార్తల్లో నిలిచారు మీనాక్షి.
వాయవ్య దిల్లీ అభ్యర్థి విషయంలో సందిగ్ధంలో పడింది కాషాయ పార్టీ. ఇక్కడింకా ఎవరి పేరునూ ప్రకటించలేదు. రాజధాని ప్రాంతంలోని మిగతా ఆరు స్థానాల్లో భాజపా అభ్యర్థులను ప్రకటించినట్లయింది. హర్ష్వర్ధన్(చాందిని చౌక్), మనోజ్ తివారీ(ఈశాన్య దిల్లీ), పర్వేశ్ వర్మ(పశ్చిమ దిల్లీ), రమేశ్ బిధురి(దక్షిణ దిల్లీ).. నలుగురు సిట్టింగ్ ఎంపీలు తిరిగి కాషాయ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో.. ఇక్కడున్న 7 స్థానాలూ గెలిచింది భాజపా.
కాంగ్రెస్ నుంచి ఒలింపిక్ విజేత...
ఈ సారి కేంద్రంలో అధికారంలోకి రావాలని ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. దిల్లీ అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మక వైఖరి అవలంబిస్తోంది. ఇప్పటికే ఇక్కడ ఆరు స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించిన హస్తం పార్టీ.. తాజాగా దక్షిణ దిల్లీ బరిలో ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్‌కు టికెట్ కేటాయించింది.
2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించారు. కెరీర్ ఆరంభం నుంచి బాక్సర్‌గానే ఉన్న.. సింగ్ అనంతరం ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి ప్రవేశించారు.
ఆయన భాజపా సిట్టింగ్ ఎంపీ రమేశ్ బిధురి, రాఘవ్( ఆప్)లతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడనున్నారు. కాంగ్రెస్ తమ అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం.. ఆనందంతో ట్వీట్ చేశారీ బాక్సర్.
''20 ఏళ్లకు పైగా.. బాక్సింగ్ రింగ్‌లోకి దిగిన ప్రతిసారి దేశం గర్వించేలా చేశా. ఇప్పుడు దేశ ప్రజల కోసం ఏదో చేయాలని ఉంది.''
- విజేందర్ సింగ్ ట్వీట్
దిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. 3 సార్లు మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్(ఈశాన్య దిల్లీ), కేంద్ర మాజీ మంత్రి అజయ్ మాకెన్(న్యూ దిల్లీ), జేపీ అగర్వాల్(చాందినీ చౌక్), అర్విందర్ సింగ్ లవ్లీ(తూర్పు దిల్లీ), రాజేశ్ లిలోథియా(వాయువ్య దిల్లీ), మహబాల్ మిశ్రా (పశ్చిమ దిల్లీ) నుంచి పోటీలో ఉన్నారు.