12 ఏళ్ల క్రితం ముంబయిలో ఉగ్రదాడులకు పాల్పడిన ముష్కరుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయనట్లు భావిస్తున్న ముగ్గురు మత్స్యకారుల కుటుంబాలకు ఇప్పుడు పరిహారం అందింది. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున గుజరాత్ ప్రభుత్వం అందజేసినట్టు అధికారులు వెల్లడించారు. గుజరాత్‌కు చెందిన నతు రాథోడ్, ముకేశ్ రాథోడ్, బల్వంత్ తండెల్ అనే ముగ్గురితో పాటు రమేశ్ బంభానియా అనే మత్స్యకారుడు, డయ్యూకి చెందిన అమర్‌సిన్హ్ సోలంకి అనే కెప్టెన్ కలిసి 2008 నవంబర్‌లో చేపల వేటకు పడవ మీద సముద్ర జలాల్లోకి వెళ్లారు.
ఆ సమయంలో పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు వారి పడవను బలవంతంగా తమ అధీనంలోకి తీసుకుని దాని మీద ముంబయికి చేరుకున్నారు. ఒడ్డుకు చేరాక వారిని కాల్చి చంపినట్లు అప్పట్లో అధికారులు భావించారు. ఆ సమయంలో సోలంకి మృతదేహం ఉండగా మిగిలిన వారి ఆచూకీ తెలియరాలేదు. వారి మృతదేహాలు కనిపించకపోవడం కారణంగా వారు మరణించినట్లు అప్పట్లో ప్రభుత్వం ధ్రువీకరించలేదు. దీని వల్ల వారి కుటుంబాలకు పరిహారం అందలేదు. చివరకు 2017 ఫిబ్రవరిలో నవ్‌సరి స్థానిక కోర్టు వారు చనిపోయినట్లు ధ్రువీకరించింది. దీంతో ఇప్పుడు వారి కుటుంబాలకు పరిహారం అందింది.
ఇదీ చూడండి: కేంద్రంపై దీదీ నిప్పులు- పీఎం కేర్స్ నిధులపై ప్రశ్న