ETV Bharat / bharat

నైపుణ్యాభివృద్ధే నిరుద్యోగ రోగానికి మందు!

ఏటా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు పట్టభద్రులై ఉద్యోగ వేటకు బయలుదేరుతున్నారు. ఓ వైపు నిరుద్యోగం, మరోవైపు నైపుణ్యాల కొరత దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నైపుణ్యలేమి పట్టభద్రులకు, పరిశ్రమలకు మధ్య అడ్డుగోడగా నిలుస్తోందంటున్నారు. మరి ఇందుకు పరిష్కార మార్గాల గురించి విశ్లేషకులు చెబుతున్నదేమిటో తెలుసుకుందాం.

communication, technical skills are the solution to the unemployement
నైపుణ్యాభివృద్ధే నిరుద్యోగ రోగానికి మందు!
author img

By

Published : Mar 16, 2020, 7:42 AM IST

నిరుద్యోగం ఓవైపు, నైపుణ్యాల కొరత మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపిస్తున్నాయి. ఏటా పట్టభద్రులై విద్యాసంస్థల నుంచి బయటికి వస్తున్న లక్షల మందికి ఉద్యోగాలు దొరకడం లేదు. అటు దేశ పారిశ్రామిక వర్గాలు నిపుణులైన పనిమంతులు దొరకడం లేదని నిట్టూరుస్తున్నాయి. నైపుణ్యలేమి పట్టభద్రులకు, పరిశ్రమలకు మధ్య అడ్డుగోడగా నిలుస్తోంది. 2020 నాటికి భారతదేశ పౌరుల సగటు వయసు 27 సంవత్సరాలు. చైనా, అమెరికా (37), ఐరోపా, జపాన్‌ (48)లతో పోలిస్తే ఉరకలెత్తే యువతరం ఉండటం భారత్‌కు ఎంతో మేలు చేయనుందని పదేళ్ల కిందటే లెక్కలు కట్టారు. అయితే లెక్కకుమిక్కిలి యువత ఉన్నా వారికి వృత్తిగతమైన నైపుణ్యాలు అరకొర కావడంతో పారిశ్రామిక ప్రగతిలో భారత్‌ స్థానం మెరుగుపడటం లేదు. మార్కెట్లో ఉన్న ఉద్యోగావకాశాలకు, భారతీయ యువత నైపుణ్యాలకూ పొంతన ఉండటం లేదని టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం ఛైర్మన్‌ గిన్నీ రొమెట్టీ నిరుడు వ్యాఖ్యానించారు. పదో తరగతి తరవాత చాలామంది పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)ల్లో వృత్తి విద్యా కోర్సులు చేస్తుంటారు. దేశ పారిశ్రామిక అవసరాల కోసం దిగువ స్థాయి నిపుణులను అందించే ఈ ఐటీఐల నాణ్యత నానాటికీ తీసికట్టుగా మారుతోంది. విద్యార్థులు రాకపోయినా తృణమో పణమో పుచ్చుకుని వారిని ఉత్తీర్ణులను చేయించి ధ్రువపత్రాలు చేతికిచ్చి పంపేస్తున్న సంస్థలు దేశవ్యాప్తంగా కోకొల్లలు. అందుకే ఐటీఐ పట్టభద్రుల్లో అత్యధిక మంది పారిశ్రామిక సంస్థల్లో కొలువులు సాధించలేకపోతున్నారు. ఐటీఐల్లో నాణ్యతను పెంచేందుకు దశాబ్దాలుగా ప్రభుత్వం పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. 2007-08లో దేశంలోని 400 ఐటీఐలను ఆధునీకరించేందుకు ప్రపంచబ్యాంకు రూ.2,500 కోట్ల సాయం అందించింది. అయినా వాటి పరిస్థితి మెరుగుపడకపోగా ఈ పుష్కర కాలంలో మరింత దిగజారింది.

ఇంజినీరింగ్​ నాణ్యతకు నీళ్లు

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిధిలోని ఆలిండియా సర్వే ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ 2018-19 నివేదిక ప్రకారం దేశంలో ఏటా 37.70 లక్షల మంది ఇంజినీరింగ్‌లో చేరుతున్నారు. ఇందులో కనీసం సగం మంది ఉత్తీర్ణులవుతున్నారనుకున్నా 20 లక్షల మంది ఇంజినీరింగ్‌ పట్టభద్రులు ఉద్యోగాల కోసం విపణిలోకి వస్తున్నారు. వీరిలో అత్యున్నత నైపుణ్యాలు కలిగిన వారిని కంపెనీలు ప్రాంగణ నియామకాల్లోనే ఎంపిక చేసేసుకుంటున్నాయి. వృత్తిపర నైపుణ్యాల్లో వెనకబడిన వారికి కొలువులు దక్కడం గగనమైపోతోంది. కోయంబత్తూరు నగరపాలక సంస్థలో స్వీపర్‌ ఉద్యోగాలు చేస్తున్న వారిలో మైక్రోబయాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసిన ఓ యువతి, మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన ఓ యువకుడు ఉన్నారు. ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చిన ఇంజినీరింగ్‌ కళాశాలలు సరైన అధ్యాపకులు, మౌలిక వసతులు లేకుండానే విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. వారు పరీక్షలు గట్టెక్కుతున్నారు గానీ నైపుణ్యాన్ని సంతరించుకోలేక పోటీ ప్రపంచంలో వెనకబడిపోతున్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ అర్హత ఉన్న ఉద్యోగాలకూ వీరు పోటీపడుతుండటంతో ఆ స్థాయి విద్యార్హతలున్న వారికి కొలువులు దక్కడం లేదు. 2020 నాటికి ఆటోమేషన్‌తో ప్రపంచవ్యాప్తంగా అయిదు లక్షల వైట్‌ కాలర్‌ (ఉన్నతస్థాయి) ఉద్యోగాలు పోతాయని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం 2018లో అంచనా వేసింది. అంటే ఆ స్థానంలో కొత్త రకం కొలువులొస్తాయన్నమాట. 2022నాటికి దేశంలోని 24 ప్రాధాన్య రంగాల్లో దాదాపు 10.90 కోట్ల మంది నిపుణులైన పనివారు అవసరమవుతారని ఓ అంచనా. తోళ్ల పరిశ్రమలు, వస్త్ర పరిశ్రమ, ఆటొమొబైల్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, గృహోపకరణాల తయారీ పరిశ్రమలు ఈ ప్రాధాన్య జాబితాల్లో ఉన్నాయి. దేశంలోని పనివారిలో కేవలం 2.3శాతం మంది మాత్రమే అధికారికంగా నైపుణ్య శిక్షణ పొందినవారు ఉన్నారు. ఇలాంటి వారి సంఖ్య యూకేలో 68, జర్మనీలో 75, జపాన్‌లో 80 శాతం మందికి అధికారికంగా నైపుణ్య శిక్షణ అందుతోంది. ఏటా 45 లక్షల మందికి మించి నైపుణ్య శిక్షణ ఇచ్చే మౌలిక వసతులు మన విద్యావ్యవస్థలో లేకపోవడం నైపుణ్య భారత్‌ లక్ష్యసాధనలో భారత్‌కు ప్రధాన అవరోధంగా ఉంది.

నైపుణ్యాభివృద్ధి శిక్షణలో ప్రపంచదేశాలకు జర్మనీ, యూకే ఆదర్శంగా నిలుస్తున్నాయి. జర్మనీలో వీఈటీ (ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌) పేరిట ప్రత్యేక కార్యక్రమం అమలవుతోంది. ఆ దేశంలో ప్రతి ఒక్కరికీ కనీస విద్యార్హత తప్పనిసరి. ఆ తరవాత కచ్చితంగా వృత్తి శిక్షణ తీసుకోవాలి. ఈ వృత్తి విద్యా కోర్సులన్నీ రెండు, మూడేళ్ల కాలవ్యవధితో ఉంటాయి. వీటిని పరిశ్రమలు, విద్యాశాఖ కలిపి రూపొందిస్తాయి. తరగతి గది శిక్షణను విద్యాసంస్థలు అందిస్తే- ప్రయోగపూర్వక శిక్షణ ఇచ్చే బాధ్యతను పరిశ్రమలు తీసుకుంటున్నాయి. కోర్సులో భాగంగా 75శాతం కాలవ్యవధిని పరిశ్రమల్లో నైపుణ్య శిక్షణకే కేటాయిస్తున్నారు. మిగిలిన 25శాతం వ్యవధిలో ఆ కోర్సు పాఠ్యాంశాలు బోధిస్తారు. ‘పని చేస్తూ నేర్చుకోండి’ అనే సూత్రం ఆధారంగా వృత్తి విద్యా విధానం నడుస్తుండటంతో కోర్సు పూర్తయ్యేసరికి విద్యార్థులకు పుస్తక పరిజ్ఞానంతోపాటు అనుభవపూర్వక శిక్షణ సైతం అందుతోంది. తయారీరంగంలో జర్మనీ ప్రపంచంలోనే అత్యున్నత దేశాల్లో ఒకటిగా నిలవడానికి విద్యార్థి స్థాయి నుంచి పరిశ్రమల్లో ఇస్తున్న నైపుణ్య శిక్షణే కీలకమవుతోంది. అక్కడ వృత్తి శిక్షణలో భాగంగా 350 రకాల కోర్సులను అందిస్తున్నారు. అప్రెంటీస్‌ చేసేవారికి పరిశ్రమలు ఉపకార వేతనం ఇస్తాయి. వృత్తి విద్యా కోర్సులను పరిశ్రమల సమాఖ్యలు సమీక్షిస్తాయి. అందువల్ల ఎప్పటికప్పుడు పరిశ్రమల్లో, మార్కెట్‌ అవసరాల్లో వస్తున్న మార్పులను గమనించి తదనుగుణంగా పాఠ్యాంశాలు, నైపుణ్య శిక్షణల్లో మార్పులు చేస్తుంటారు.

నిబద్ధతా ముఖ్యమే

ప్రధాని నరేంద్ర మోదీ 2015 ఏప్రిల్‌లో జర్మనీ వెళ్లినప్పుడు చాన్సెలర్‌ మెర్కెల్‌తో జరిపిన చర్చల్లో ‘నైపుణ్య భారత్‌’పై సహకారాన్ని అభ్యర్థించి, ఆ మేరకు ఆ దేశంతో రెండు ఒప్పందాలూ కుదుర్చుకున్నారు. కోట్లాది మంది నైపుణ్యాభివృద్ధికి శిక్షణ అందించాలంటే నిధులు, నిబద్ధతా రెండూ కావాలి. 2020-21 కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి రూ.93వేల కోట్లు కేటాయిస్తే, అందులో నైపుణ్యాభివృద్ధికి విదిలించింది కేవలం మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే! ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి నిధులు పెంచడంతోపాటు- విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు పరిశ్రమలు ముందుకురావాలి. జర్మనీ, యూకే లాంటి దేశాల్లో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి యువతకు నైపుణ్యాలు నేర్పుతున్నాయి. చదువుతోపాటు కొలువుకు అవసరమైన నేర్పును అలవరుస్తున్నాయి. భారత్‌ సైతం ఈ విధానాలను ఆదర్శంగా స్వీకరించాలి. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధులతోనైనా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వచ్చు. ఇది వారికి ఉభయతారకంగా ఉపయోగపడుతుంది. ఇందుకు తగ్గ వాతావరణాన్ని, ప్రోత్సాహాన్ని ప్రభుత్వం కల్పించాలి. అప్పుడే నిపుణులైన యువతతో మన పరిశ్రమలు కళకళలాడతాయి. తయారీ రంగం ముందంజ వేసి ఆర్థికాభివృద్ధి దిశగా దేశం వడివడిగా అడుగులు వేయగలుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా నిరుద్యోగ భూతాన్ని భూస్థాపితం చేయడానికి నైపుణ్య శిక్షణే అసలైన అస్త్రం.

- శ్యాంప్రసాద్‌ ముఖర్జీ కొండవీటి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.