కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో బాధితులకు చికిత్స అందించడానికి కొన్ని ప్రాంతాల్లో.. సరైన వైద్య పరికరాలు లేక ప్రపంచంలోని చాలా ఆస్పత్రులు, వైద్యులు ఇబ్బంది పడుతున్నారు. మెరుగైన చికిత్స అందించాలంటే మరిన్ని వైద్య పరికరాలు, పీపీఈ కిట్ల అవసరం ఉంది. ఈ పరిస్థితిని గమనించిన కొందరు సాధారణ వ్యక్తులు సైటింస్టులుగా మారిపోయారు. కరోనా చికిత్సకు అవసరమైన వైద్య పరికరాలు, వైరస్‌తో పోరాడేందుకు వినూత్న వస్తువులను సొంతంగా ఆవిష్కరిస్తున్నారు. వారెవరు.. ఏం ఆవిష్కరించారో చూద్దాం!
మిలటరీ మాజీ వైద్యుడు.. వెంటిలేటర్ రూపొందించారు
కరోనా బాధితులకు చికిత్స అందించడం కోసం మాజీ వైద్య సిబ్బంది రంగంలోకి దిగుతున్నారు. వేల్స్‌కు చెందిన మిలటరీ మాజీ వైద్యుడు రాయిస్ థామస్ ప్రస్తుతం కార్మెర్థాన్ ఆస్పత్రిలో అనస్తీషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కరోనా బాధితులు భారీగా పెరుగుతుండటం, వైద్య పరికరాల కొరత ఏర్పడటం ఆయన్ను కలిచి వేసింది. దీంతో స్వయంగా కరోనా బాధితుల కోసం అత్యవసర వెంటిలేటర్ రూపొందించారు. ఐసీయూలో చికిత్స అందించాల్సిన అవసరం రాకముందే బాధితులకు ఈ అత్యవసర వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించొచ్చని డాక్టర్ థామస్ చెబుతున్నారు. దీనిని పరిశీలించిన వేల్స్ ప్రభుత్వం వినియోగానికి అనుమతి ఇచ్చింది. దీంతో రోజుకు 100 అత్యవసర వెంటిలేటర్లను తయారు చేస్తున్నారు.
![common people invented medical devices amid coronavirus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6885788_thamous-ventltr.jpg)
ఈ మాస్కుతో మరింత భద్రత
కరోనా వ్యాపించకుండా మాస్కులు వినియోగిస్తున్నాం. ఈ మాస్కులు ఎంతవరకు మనల్ని రక్షిస్తాయన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన ఓ మాజీ సైనికాధికారి పాల్ హోప్.. వినూత్న మాస్కును రూపొందించారు. సాధారణ మాస్కులు కేవలం ముక్కు, ముఖాన్ని మాత్రామే కప్పుతాయి. వైరస్టాటిక్ షీల్డ్ పేరుతో పాల్ తయారు చేసిన మాస్క్ స్కార్ఫ్ తరహాలో ముఖాన్ని కప్పి వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన ఈ మాస్కును ఎప్పటికప్పుడు శుభ్రం చేసి వాడుకోవచ్చు. వీటిని 25 డాలర్ల చొప్పున మార్కెట్లో అమ్ముతున్నారు.
![common people invented medical devices amid coronavirus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6885788_vruststic-mask.jpg)
3డీ పీపీఈ
ఇంగ్లాండ్‌కు చెందిన ఆరొన్ శ్రైవ్.. ఓ త్రీడి డిజైనర్. కరోనా నియంత్రణ చర్యల్లో తాను భాగం కావాలనుకున్నాడు. ఓవైపు తన వృత్తి చేసుకుంటూనే రాత్రి వేళలో త్రీడి ప్రింటర్‌తో వైద్య సిబ్బందికి ఉపయోగపడే ఫేస్ మాస్క్ తయారు చేశాడు. స్ట్రిప్‌తో తలకు పట్టి ఉంచేలా మాస్క్‌ను సిద్ధం చేశాడు. ఇప్పటివరకు శ్రైవ్ 800 ఫేస్ మాస్కులు తయారు చేసి వైద్య సిబ్బందికి అందించాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఓ దంపతులు సైతం పీపీఈల తయారీకి ముందుకొచ్చారు. తమ సొంత కంపెనీ స్మాష్‌గార్డ్ విండో ఫిల్మ్స్‌లో ఉపయోగించే ఫిల్మ్ కవర్లను ఫేస్ మాస్కులుగా మార్చారు. ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో 48 గంటల్లోనే వారికి 30 వేల మాస్కులకు ఆర్డర్లు వచ్చాయి.
![common people invented medical devices amid coronavirus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6885788_faceshield.jpg)
సూక్ష్మక్రిములను చంపే పరికరం
రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో సూక్ష్మక్రిముల వ్యాప్తిలో ముఖ్య పాత్ర పోషించేది డోర్ హ్యాండిల్స్. కొన్నాళ్ల కిందట జమైకాలోని ఓ ఆస్పత్రిలో 40 మంది చిన్నారులకు బ్యాక్టీరియా సోకడానికి డోర్ హ్యాండిల్సే కారణమని గుర్తించాడు రేవాన్ స్టీవర్ట్ అనే విద్యార్థి. దీనికి పరిష్కారంగా ఓ పరికరాన్ని కనుగొన్నాడు. సూక్ష్మక్రిములను చంపే అతినీలిలోహిత కిరణాలను ప్రసరింపజేసే పరికరాన్ని రూపొందించాడు. గ్జెర్మోసోల్‌గా పిలిచే ఈ పరికరాన్ని హ్యాండిల్స్‌కు తగిలిస్తే చాలు. మనుషుల వల్ల దానిపై చేరే క్రిములను ఈ పరికరం నుంచే వెలువడే యూవీ కిరణాలు చంపేస్తాయి. ఈ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
![common people invented medical devices amid coronavirus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6885788_door-hamdle.jpg)
కారు, కంప్యూటర్ భాగాలతో...
కాదేది కవితకు అనర్హం అన్నట్లు.. కాదేది వైద్యపరికరం తయారీకి అనర్హం అని నిరూపిస్తున్నారు ఐర్లాండ్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు. తమ కళాశాల సహకారంతో కార్లు, కంప్యూటర్ భాగాలను ఉపయోగించి వెంటిలేటర్లు తయారు చేశారు. వారానికి ఐదు వెంటిలేటర్లు రూపొదించాలనే లక్ష్యంతో వీరు ముందుకుసాగుతున్నారు. వెంటిలేటర్లతో పాటు ఫేస్ మాస్కులు రూపొందించి వైద్య సిబ్బందికి అందజేస్తున్నారు.
![common people invented medical devices amid coronavirus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6885788_itsligo.jpg)
ముఖం తాకితే హెచ్చరించే బ్యాండ్
తరచూ ముఖాన్ని తాకడం వల్ల నోరు, ముక్కు, కళ్ల ద్వారా కరోనా వైరస్ శరీరంలోకి చేరే ప్రమాదముంది. చాలామంది తమకు తెలియకుండానే ముఖాన్ని తాకుతుంటారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు సియాటిల్‌లో చిన్న స్టార్టప్ సంస్థను ప్రారంభించిన మాథ్యూ సోదరులు ఓ పరికరాన్ని కనిపెట్టారు. ఇమ్యూటచ్ పేరుతో తయారు చేసిన ఈ పరికరాన్ని రిస్ట్ వాచ్‌లా ధరించాలి. మీరు చేతులతో ముఖాన్ని తాకడానికి ప్రయత్నించిన ప్రతిసారీ ఈ పరికరం మోగుతుంది. దీంతో మీరు జాగ్రత్తపడొచ్చు. నిజానికి దీనిని గోళ్లు కొరికే అలవాటు ఉన్నవారి కోసం రూపొందించారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి తగ్గించడానికి ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దారు. హవాయికి చెందిన ఓ ఫ్రొఫెసర్ ఫిట్‌బిట్ బ్యాండ్ ఫిట్‌నెస్ ట్రాకర్‌లో జలాపే నో పేరుతో ఓ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ముఖాన్ని తాకేందుకు మనం ప్రయత్నిస్తే.. ‘నో’ అంటూ ఈ ట్రాకర్ నుంచి వాయిస్ వినిపిస్తుంది.
![common people invented medical devices amid coronavirus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6885788_trackrs.jpg)
ఉమ్ము ప్రమాదం.. ఇది వాడితే ఉపయోగం
పాన్, గుట్కాలు తిని ఉమ్మివేయడం వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో దేశంలోని కొన్ని రాష్ట్రాలు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధించాయి. నాగ్‌పూర్‌కి చెందిన ముగ్గురు యువకులు (ప్రతీక్ మల్హొత్ర, రితూ మల్హొత్ర, ప్రతీక్ హర్డే) ఈజీ స్పిట్ పేరుతో వినూత్న ప్లాస్టిక్ కప్పులను తయారు చేస్తున్నారు. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లగలిగేలా ఉండే ఈ కప్పుతో ఉమ్మివేసే అలవాటు ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు.. ఉమ్మంతా కప్పులోనే హైబ్రీడ్ ఎరువుగా మారిపోతుంది. కరోనా రాకముందే ఈజీ స్పిట్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం వీటి డిమాండ్ 50 శాతం పెరిగిందట.
![common people invented medical devices amid coronavirus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6885788_eazyspit.jpg)
తలుపులు తెరవడానికో పరికరం
కరోనా వ్యాప్తి దృష్ట్యా ఏం ముట్టుకోవాలన్నా భయపడాల్సి వస్తోంది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు తలుపు హ్యాండిల్స్ పట్టుకోవడానికి సంశయిస్తున్నారు. అందుకే ఇంగ్లాండ్‌కు చెందిన ఓ ఆన్‌లైన్ గిఫ్ట్ కంపెనీ వినూత్న పరికరాన్ని రూపొందించింది. తలుపు హ్యాండిల్‌ను ముట్టుకోకుండా తెరవడానికి కూల్‌డ్రింక్స్ ఓపెనర్ తరహాలో డోర్ ఓపెనింగ్ టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల వైరస్ వ్యాప్తి తగ్గే అవకాశం ఉందని సంస్థ చెబుతోంది.
![common people invented medical devices amid coronavirus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6885788_dooropen.jpg)
కరోనా కట్టడిలో కరోనా వైరస్ కారు
కరోనా నియంత్రణలో చికిత్స కన్నా ముందుజాగ్రత్త ముఖ్యం. అందుకే ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించి, ప్రజలను ఇళ్లలోనే ఉండమంటున్నాయి. అయినా కొందరు రోడ్లపైకి వస్తున్నారు. అందుకే కరోనా నియంత్రణలో తన వంతు సాయంగా హైదరాబాద్‌కు చెందిన సుధాకర్ యాదవ్ వినూత్న ప్రయత్నం చేశారు. కరోనా వైరస్ ఆకృతిలో ఓ కారును రూపొందించి పలు ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఇళ్లలోనే ఉండకపోతే కరోనా వైరస్ సోకుతుందని అవగాహన కల్పిస్తున్నాడు. చిన్న ప్రయత్నమే అయినా.. గొప్ప పని చేస్తున్న సుధా‘కార్’ను అందరూ అభినందిస్తున్నారు.
![common people invented medical devices amid coronavirus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6885788_corona-car.jpg)
సగం ముఖం మాస్కుపైన
కరోనా వల్ల ఇప్పుడు అందరూ ఫేస్ మాస్కులు ధరిస్తున్నారు. బయటకు వెళ్లినప్పుడు మాస్కును తీసే ప్రసక్తే లేదు. దీంతో కొన్నిసార్లు వ్యక్తులను గుర్తించడం కష్టమవుతోంది. అలాగే.. సెల్‌ఫోన్‌లో ఫేస్ ఐడీ పాస్‌వర్డ్ పెట్టుకున్న వారు ప్రతీసారి మాస్కును తీసి ఫోన్‌ను అన్‌లాక్ చేయాల్సి వస్తోంది. ఈ సమస్యలకు పరిష్కారంగా శాన్‌ఫ్రాన్సిస్కోకి చెందిన డిజైనర్ డానియల్ బాస్కిన్ వినూత్న మాస్కులను రూపొందిస్తున్నారు. మాస్కు ధరిస్తే దాదాపు సగం ముఖం కనిపించదు.. అందుకే మాస్కు కప్పి ఉంచే మనిషి ముఖం సగం భాగాన్ని మాస్కుపై ప్రింట్ చేస్తున్నారు. ఎవరైనా కావాలనుకుంటే వారి ఫేస్ ఐడీ కంపాటబుల్ వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేయొచ్చు. ఎన్ 95 మాస్కుకు సమాన నాణ్యతతో వీటిని తయారు చేసి అమ్మకానికి పెట్టారు.
![common people invented medical devices amid coronavirus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6885788_faceid.jpg)