దేశంలో మూకదాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రోసీజర్ (సీఆర్పీసీ)లో అవసరమైన మార్పులపై సూచనలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో మూక దాడులపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు షా.
"ఐపీసీ, సీఆర్పీసీలో మార్పుల కోసం తగిన సూచనలు చేయాలని నేనే స్వయంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, గవర్నర్లకు లేఖ రాశాను. ఆయా రాష్ట్రాల్లోని అనుభవజ్ఞులైన దర్యాప్తు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సలహాలు, సూచనలు తీసుకున్నాక మాకు పంపాలని సూచించాం. ఐపీసీ, సీఆర్పీసీలో మార్పుల కోసం బీపీఆర్ అండ్ డీ కింద ఓ కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ సిఫార్సుల మేరకు సవరణలు చేసేందుకు పని ప్రారంభిస్తాం. ఇందులో సుప్రీం కోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుంటాం."
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.
మూక దాడులకు ఐపీసీలో ప్రత్యేక నిర్వచనం ఏదీ లేదని.. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 300, 302 కిందనే నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్. మూక దాడులపై రాజస్థాన్, మణిపుర్ రాష్ట్రాలు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చాయని.. ప్రస్తుతం కేంద్రం ఆమోదం కోసం పంపినట్లు వివరించారు.
ఇదీ చూడండి: ఐదుగురు సహచరుల్ని బలిగొన్న జవాన్- ఎందుకు?