పాకిస్థాన్‌లో శిక్ష అనుభవిస్తున్న నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది భారత్. కుల్‌భూషణ్ కేసులో పాకిస్థాన్ దాఖలు చేసిన పునఃసమీక్షా పిటిషన్ విచారణ చేపట్టేందుకు ఇస్లామాబాద్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ మేరకు వెల్లడించింది.
అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు మేరకు జాదవ్‌కు ఎలాంటి అడ్డంకులు లేని న్యాయ సహాయం అందించటంలో పాకిస్థాన్ విఫలమైందని విమర్శించారు విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ.
" కుల్‌భూషణ్ జాదవ్‌ను కాపాడేందుకు మేము కట్టుబడి ఉన్నాం. ఈ విషయంలో మేము స్పష్టమైన వైఖరితో ఉన్నాం. ఈ కేసులో భారత్‌కు అందుబాటులో ఉన్న సమర్థవంతమైన నివారణ మార్గాలను పాక్ అడ్డుకుంటోంది."
- అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ ప్రతినిధి.
జాదవ్‌కు న్యాయ ప్రతినిధిని నియమించాలని కోరుతూ.. పాక్ ఏకపక్షంగా ఈనెల 22న ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ దాఖలు చేసే ముందు ఈ కేసులో ప్రధాన పార్టీ అయిన భారత్‌తో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే నిర్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి: కుల్‌భూషణ్‌కు దౌత్య సాయంతో పాక్ మళ్లీ వక్రబుద్ధి