దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వైరస్ కట్టడి కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలోని ఓ న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలో స్టాంపులు మొదలైన వాటిని అంటించేందుకు లాలాజలం వాడటాన్ని నిషేధించింది.
దరఖాస్తులు, విజ్ఞాపనలపై కోర్టు ఫీజు స్టాంపులను అంటించేందుకు... సమన్లు, నోటీసులు తదితరాలు ఉంచే కవర్లను అంటించేందుకు ఉమ్మిని వాడరాదని దిల్లీలోని తీస్ హజారీ న్యాయస్థానం పేర్కొంది. డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ న్యాయమూర్తి గిరీష్ కథ్‌పాలియా ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. కోర్టు పరిసరాల్లో కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకున్న ఈ నిర్ణయం న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులందరికీ వర్తిస్తుందని న్యాయమూర్తి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆఫీసు కార్యకలాపాలలో భాగంగా ఫైళ్లు, రిజిస్టర్లు మొదలైన వాటికి సంబంధించిన కాగితాలను తిరగేసేందుకు కూడా ఉమ్మిని వాడటం నిషేధించారు. లాలాజలానికి బదులుగా ప్లాస్టిక్ స్పాంజి ఉండే డంపర్ ప్యాడ్‌ను వాడాల్సిందిగా ఈ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
ఇదీ చూడండి: లాక్డౌన్ 4.0: బస్సులు రయ్రయ్- సెలూన్లు హౌస్‌ఫుల్