బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. 'అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్(ఏఈఎస్)' బాధిత చిన్నారులను, వారి కుటుంబసభ్యులను పరామర్శించడానికి ఆయన ముజఫర్‌పుర్‌లోని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఉన్న కొందరు ఆగ్రహంతో నితీశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఏఈఎస్ వ్యాధి లక్షణాలతో శ్రీకృష్ణ వైద్య కళాశాలలో 90 మంది, కేజ్రీవాల్ ఆసుపత్రిలో 19 మంది చిన్నారులు మరణించారు. ఆయా ఆసుపత్రుల్లో మరింత మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు.
నితీశ్ గోబ్యాక్
ఎస్‌కేఎంసీహెచ్ ఆసుపత్రిని నితీశ్‌కుమార్ నేడు సందర్శించారు. ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ, స్థానిక ఎమ్మెల్యే సురేశ్ శర్మ కూడా ఉన్నారు. అదే సమయంలో ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టిన స్థానికులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా 'నితీశ్ గోబ్యాక్' అంటూ నినాదాలు చేశారు.
ఆసుపత్రి ఆవరణలో కొత్తగా ఏర్పాటుచేసిన నీళ్ల ట్యాంకును చూపిస్తూ, ఇదంతా ముఖ్యమంత్రికి అనుకూలంగా అభిప్రాయం పెరిగేలా చేసిన జిమ్మిక్కని బాధితులు విమర్శించారు. ముందుగానే సీఎం తగిన చర్యలు తీసుకొని ఉంటే చాలా ప్రాణాలు పోకుండా ఉండేవని ఆవేదన వ్యక్తం చేశారు.
అత్యవసర సమావేశం
వందమందికిపైగా చిన్నారులు చనిపోయినా ముఖ్యమంత్రి కనీసం పరామర్శించలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వైద్యులు, అధికారులతో శనివారం దిల్లీ నుంచే నితీశ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. చిన్నారుల చికిత్సకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
పోషకాహార లోపమే కారణం
ముజఫర్పుర్ను సందర్శించిన వైద్యుల బృందం ఏఈఎస్ అనేక వ్యాధి లక్షణాలు కలిగి ఉందని, ఇది జపాన్‌లోని ఎన్సెఫలైటిస్ అనే వైరల్ ఇన్ఫెక్షన్ కంటే భిన్నమైందని పేర్కొన్నారు.
పోషకాహార లోపంతో పాటు మెదడువాపు వ్యాధి లక్షణాలు, తీవ్ర జ్వరం, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గడమే చిన్నారుల మృతి కారణమని వైద్యులు తెలిపారు.
ముజఫర్‌పుర్‌లో పండించే 'లిచీ'లో ఉండే ఓ రకమైన ప్రమాదకరమైన పదార్థం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తున్నట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: 'వైద్యుల రక్షణ'పై అత్యవసర విచారణకు సుప్రీం నో