కేరళలో తొలి వాటర్ టాక్సీని అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'కాటమరాన్' పడవల ద్వారా కేరళ జల రవాణా శాఖ అందించే ఈ సేవలను గురువారం.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించారు. అలప్పుజ రేవులో జరిగిన ఈ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్నారు సీఎం. కాటమరాన్ డీజిల్ శక్తితో పనిచేసే ఈ ట్యాక్సీలో 10 మంది ప్రయాణించొచ్చు.
'సురక్షిత ప్రయాణం'
కాటమరాన్ పడవల్లో ప్రయాణం సురక్షితమైనదని అన్నారు విజయన్. జల రవాణాలో తాజాగా తీసుకువచ్చిన ఈ మార్పులతో.. కేరళ పర్యటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.
"కాటమరాన్ పడవలతో జలరవాణాకు మంచి ఆదరణ లభిస్తుంది. వీటిలో ప్రయాణం చౌకైనది, సురక్షితమైనది. ఈ నూతన జలరవాణాకు ఓడల భూమిగా పేరు గాంచిన అలప్పుజ.. తగిన ప్రదేశం. ఈ సేవలతో కేరళ పర్యటకం మరింత అభివృద్ధి చెందుతుంది. ఇందులో ప్రయాణికులకు బీమా సౌకర్యాన్నీ కల్పిస్తున్నాం."
-- పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి
రూ.3.14 కోట్ల వ్యయంతో 4 వాటర్ టాక్సీలను కేరళ ప్రభుత్వం సిద్ధం చేసింది. వీటిలో మొదటి పడవను గురువారం ప్రారంభించారు. 7 నాటికల్ మైళ్ల వేగంతో ఈ పడవలు పరిగెడుతాయి. రూ.14 కోట్ల వ్యయంతో మొత్తం ఏడు కాటమరాన్ బోట్లను నిర్మిస్తోంది కేరళ ప్రభుత్వం.
నవగతి మెరైన్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్.. ఈ వాటర్ టాక్సీలను నిర్మించింది. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, సోలార్ ప్యానెల్ అమరికతో అన్ని విద్యుత్ అవసరాలను తీర్చేలా దీన్ని తయారుచేశారు. చిన్న పరిమాణం కారణంగా వీటిల్లో ఎక్కడికైనా చేరుకోవచ్చు. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.
ఇదీ చూడండి: కేరళలో ఆగని కరోనా ఉద్ధృతి.. కొత్తగా 9,016 కేసులు