అమెరికా అధ్యక్షుడి భార్య, ఆ దేశ ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్ దిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న 'క్లాస్ ఆఫ్ హ్యాపీనెస్'కు హాజరుకానున్నారు. సోమవారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి భారత పర్యటనకు విచ్చేస్తున్న ఆమె.. దిల్లీ సర్కారు ప్రవేశపెట్టిన 'సంతోష పాఠాలు' ఎలా ఉంటాయో తెలుసుకోనున్నారు.
కేజ్రీవాల్ ఆలోచన నచ్చి..
2018లో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం 'క్లాస్ ఆఫ్ హ్యాపినెస్'ను ప్రవేశపెట్టింది. నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులు ఇందులో పాల్గొనేలా.. ఎన్నో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టింది.
"హ్యాపీనెస్ క్లాసెస్‌తో విద్యావిధానంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందిస్తే.. ఒత్తిడి పోతుంది. మార్కులంటే భయం పోతుంది. చదువే సర్వం కాదు, విలువలు ముఖ్యమని తెలుసుకుంటారు."
- ఓ పాఠశాల ప్రిన్సిపల్
'క్లాస్ ఆఫ్ హ్యాపీనెస్'లో చిన్నారి మనసులను సానుకూల దృక్పథంతో నింపి.. ఆనందమైన జీవితంపైపు అడుగులు వేయిస్తున్నారు ఉపాధ్యాయులు. విద్యార్థుల్లో ఒత్తిడి తీసేసి, ఆసక్తికరమైన కథలు చెప్పి వారిలో విలువలు పెంచే దిశగా కదం తొక్కుతున్నారు.
"రోజూ రెండు మూడు నిమిషాల పాటు విద్యార్థులు కళ్లు మూసుకుని విశ్రాంతిగా కూర్చుంటారు. సానుకూల విషయాలు ఆలోచిస్తారు. శ్వాసపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఆపై కథలు, ఇతర కార్యక్రమాలు చేపడతాం. "
-ఉపాధ్యాయురాలు.
యావత్ దేశం ప్రశంసించిన ఈ విద్యావిధానాన్ని.. విద్యార్థులు ఎంతో ఇష్టపడుతున్నారు.
"హ్యాపీనెస్ క్లాస్‌లో నేను నేర్చుకుందేమిటంటే.. మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఒకరికొకరం సాయం చేసుకోవాలి. పెద్దలను గౌరవించాలి. ఎదుటివారితో ప్రేమగా మాట్లాడాలి."
-విద్యార్థిని
ఇప్పుడు.. అగ్రరాజ్య ప్రథమ మహిళనూ ఈ పాఠశాలలు ఆకట్టుకున్నాయి. అందుకే, ప్రత్యేకంగా ఈ సంతోషాల పాఠాల విశేషాలేంటో తెలుసుకునేందుకు వస్తున్నారు మెలానియా.
ఇదీ చదవండి:నమస్తే ట్రంప్: 'ఫ్యామిలీ ప్యాక్'తో కొత్త చరిత్ర!